Sowjanya Anneboina August 31, 2026prabhanews.com
బోధన్ రూరల్, ఆంధ్రప్రభ: సాలూర మండల కేంద్రంలోని సహకార సంఘ ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు.
రైతుల రుణాల మంజూరు, చెల్లింపుల వివరాలతో పాటు బంగారు రుణాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరపాలని వినతిపత్రంలో కోరారు. విండో ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ఆహార పంటల వివరాలు, వాటికి సంబంధించిన కమీషన్, గోదాముల నిర్మాణాలు, సహకార సంఘ నిధుల వినియోగంపై కూడా సమగ్రంగా పరిశీలించాలని రైతులు అధికారులను కోరారు.
గతంలో సాలూరలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేసిన రైతులను కొందరు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సహకార సంఘానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై పారదర్శకంగా విచారణ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. రైతులు లేవనెత్తిన అంశాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
