Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ: ఖమ్మం నగరానికి చెందిన ఉద్యోగి బాణోత్ వెంకటేష్‌కు సామాజిక సేవా రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ లభించింది.
పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం, మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం, వృద్ధులకు సేవలు అందించడం, తలసేమియా బాధితులకు రక్తదానం చేయడం వంటి కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వేదికగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఎం.జిన్ను రామశర్మ చేతుల మీదుగా బాణోత్ వెంకటేష్ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం సంధ్యాతండాకు చెందిన బాణోత్ వెంకటేష్, బాణోత్ మోదీన్ కుమారుడు. ప్రస్తుతం ఖమ్మం నగరంలోని శ్రీ హవిషా ఆసుపత్రిలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు తన సొంత ఖర్చులతో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచితంగా వైద్య సేవలు, మందులు అందిస్తున్నారు.
దేవాలయాల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు పేద విద్యార్థుల చదువులకు సాయం చేస్తున్నారు. తలసేమియా బాధితులకు అవసరమైన సమయంలో రక్తదానం చేస్తూ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. సామాజిక సేవా రంగంలో వెంకటేష్ అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించిన ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, పలువురు ప్రముఖులు వెంకటేష్‌ను అభినందించారు.
