Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సమస్యల పరిష్కారానికే 'పల్లె పల్లెకు పొన్నం అన్న'

Abhi Naga August 22, 2026prabhanews.com

మంత్రి పొన్నం ప్రభాకర్‌

పెద్దతండాకు రూ.2.05 కోట్లతో బీటీ రోడ్డు
రూ.20 లక్షలతో పూర్తయిన అంతర్గత సీసీ రోడ్ల ప్రారంభం..

గ్రామంలో ఇప్పటివరకు రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులు
గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ సాగునీరు అందిస్తామని హామీ

సిద్దిపేట, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గం అక్కన్నపేట మండలం పెద్దతండాలో రూ.2.05 కోట్లతో నిర్మించనున్న పెద్దతండా-అవ్వకుంట బీటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే రూ.20 లక్షలతో పూర్తిచేసిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. 'పల్లె పల్లెకు పొన్నం అన్న-పల్లె పల్లెలో ప్రజా పాలన' కార్యక్రమంలో భాగంగా పెద్దతండాలో పర్యటించిన మంత్రి.. గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రూ.3.50 కోట్లతో అభివృద్ధి పనులు

పెద్దతండాలో ఇప్పటివరకు సుమారు రూ.3.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్‌, రైతు భరోసా, రేషన్‌ కార్డులు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు తదితర పథకాలను అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహిస్తూ.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం చేరేలా అధికారులు పనిచేయాలని సూచించారు.

నీటి సంరక్షణపై దృష్టి

నీటి వనరుల సంరక్షణ కోసం ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని మంత్రి సూచించారు. భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించి అధిక ఆదాయం పొందే అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.

ప్రతి గ్రామానికీ సాగునీరు

హుస్నాబాద్‌ నియోజకవర్గంలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజలు నేరుగా తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకోవడం, అక్కడికక్కడే అధికారులతో సమన్వయం చేసి పరిష్కార మార్గాలు చూపడమే 'పల్లె పల్లెకు పొన్నం అన్న' కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News