Sowjanya Anneboina August 29, 2026prabhanews.com
ఊట్కూర్, ఆంధ్రప్రభ: సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి విశిష్టమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం ఉపన్యాసకులు దొరోళ్ల కృష్ణయ్య అన్నారు.
శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో 'మన గుడి' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధానికి, పరస్పర రక్షణకు ప్రతీకగా జరుపుకుంటారని తెలిపారు.
ఈ సందర్భంగా ఒకరికొకరు రాఖీ కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారని చెప్పారు. బ్రాహ్మణులు ఈ రోజున నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి, వేదాధ్యయనాన్ని తిరిగి ప్రారంభించే ఉపాకర్మను నిర్వహిస్తారని వివరించారు. శ్రావణ పౌర్ణమి రోజున శివపార్వతులు, శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీ అని తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు లోకకల్యాణానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలని సూచించారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించి, నిత్యం ధూపదీప నైవేద్యాలు జరిగేలా చూడాలని కోరారు.
ప్రతి గ్రామంలోని దేవాలయంలో వారానికి ఒకరోజు భజన కార్యక్రమం నిర్వహించాలని కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా జాతీయ సామరస్యం, ఐక్యత పెంపొందుతాయని తెలిపారు. దేశం, ధర్మం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, సమాజ శ్రేయస్సు కోసం తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు సుధాకర్‌రెడ్డి, హెచ్.నర్సింహా, రామాంజనేయులు, దత్తప్ప, వెంకప్పగౌడ్, వెంకటప్ప, శ్రీనివాసులు, శివారెడ్డి, అశోక్‌రెడ్డి, నరసింహారెడ్డి, రామలింగంగౌడ్, ఉప్పు కృష్ణయ్య, ఉప్పు రాఘవేంద్ర, మంగలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
