Nagamani Malligari September 2, 2026prabhanews.com
మురికి కాలువలను సొంతంగా శుభ్రం చేసుకున్న గోనుగొప్పుల తండా యువత
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం గోనుగొప్పుల తండా గ్రామంలో మురికి కాలువలు పూడుకుపోయి దుర్వాసన, దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పంచాయతీ అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని తండా యువత ఆరోపించింది.
దీంతో సమస్యను పరిష్కరించేందుకు యువకులే స్వయంగా రంగంలోకి దిగి మురికి కాలువలను శుభ్రం చేశారు.
గత కొన్ని నెలలుగా కాలువల్లో చెత్త, మట్టి పేరుకుపోవడంతో మురుగునీరు సక్రమంగా ప్రవహించడం లేదని గ్రామస్తులు తెలిపారు. వర్షాలు కురిసిన సమయంలో మురుగునీరు ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల పారిశుద్ధ్య సమస్యలతో పాటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాలువల సమస్యపై పలుమార్లు సర్పంచ్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో తామే శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని యువకులు పేర్కొన్నారు. పంచాయతీ నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ కనీస పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
గోనుగొప్పుల తండాలో పారిశుద్ధ్య సమస్యను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని యువజన సంఘం డిమాండ్ చేసింది. మురికి కాలువలకు శాశ్వత మరమ్మతులు చేపట్టి, మురుగునీరు సక్రమంగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రజలకు పారిశుద్ధ్య సమస్యలు లేకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.
