Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

సెప్టెంబర్ 3న హస్తినకు సీఎం రేవంత్

Abhi Naga August 30, 2026prabhanews.com

  • భట్టి, మహేశ్ గౌడ్ కూడా ఢిల్లీ పర్యటనకు సన్నాహాలు
  • కొండా సురేఖ వ్యవహారం, మంత్రివర్గ ఖాళీలు, పార్టీ-ప్రభుత్వ మార్పులపై కీలక చర్చలు జరిగే అవకాశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత పరిణామాలు ఇప్పుడు ఢిల్లీ స్థాయికి చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెప్టెంబర్ 3న మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం నేత కేసీ వేణుగోపాల్‌తో కీలక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, అంతకు నాలుగు రోజుల ముందే రాష్ట్రంలోని ముఖ్య నేతలను ఢిల్లీకి పిలిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదాలు, క్రమశిక్షణ సమస్యలు, ప్రభుత్వ-పార్టీ సమన్వయం, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలపై అధిష్ఠానం స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

కొండా సురేఖ వ్యవహారంపై చర్చ?

మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చినట్లు చెబుతున్న నివేదికను అధిష్ఠానం పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

క్రమశిక్షణ విషయంలో అధిష్ఠానం కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించే నేతలకు స్పష్టమైన హెచ్చరిక ఇవ్వాలనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ

తెలంగాణ మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీతో పాటు విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం పదవుల్లో ఉన్న కొందరు నేతల్లో కూడా మార్పులపై ఉత్కంఠ నెలకొంది.

కొత్తగా ఎవరికి మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందనే అంశంపై ఇప్పటికే పలు పేర్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కొండా సురేఖ స్థానంలో కొత్త నేతకు అవకాశం కల్పించవచ్చన్న ప్రచారంతో పాటు ఎమ్మెల్సీ విజయశాంతి, ఆది శ్రీనివాస్ తదితరుల పేర్లు చర్చకు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఊహాగానాలేనని, అధిష్ఠానం నిర్ణయం తర్వాతే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మహేశ్ గౌడ్‌కు మంత్రి పదవా?

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపైనా చర్చ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆయనకు మంత్రి పదవి దక్కితే టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలను మరో నేతకు అప్పగించే అవకాశం ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేరు కూడా రాజకీయ చర్చల్లో వినిపిస్తోంది. ఒకవేళ ప్రభుత్వ, పార్టీ పదవుల్లో మార్పులు జరిగితే సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చని తెలుస్తోంది. దళిత సామాజిక వర్గానికి స్పీకర్ పదవి, బీసీ వర్గానికి పార్టీ అధ్యక్ష బాధ్యత వంటి సమీకరణాలను అధిష్ఠానం పరిశీలించే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. అయితే ఈ అంశాలపై కూడా అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు.

ప్రక్షాళన దిశగా కాంగ్రెస్?

మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ, ప్రభుత్వ స్థాయిలో ఒకేసారి మార్పులు చేర్పులకు అధిష్ఠానం శ్రీకారం చుట్టబోతోందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, రాబోయే రాజకీయ సవాళ్లను దృష్టిలో పెట్టుకుని పార్టీని మరింత క్రమశిక్షణతో నడిపించాల్సిన అవసరాన్ని అధిష్ఠానం గుర్తించినట్లు తెలుస్తోంది.

అంతర్గత విభేదాలు, బహిరంగ విమర్శలు ప్రభుత్వ ప్రతిష్ఠపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం కాంగ్రెస్ అధిష్ఠానంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గీత దాటితే ఎంతటి నాయకుడైనా చర్యలు తప్పవనే సంకేతాన్ని పంపించాలన్న వ్యూహం కూడా ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సెప్టెంబర్ 3 సమావేశంపైనే అందరి చూపు

సెప్టెంబర్ 3న జరగనున్నట్లు చెబుతున్న ఢిల్లీ సమావేశం తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లోని పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కొండా సురేఖ వ్యవహారం, మంత్రివర్గ ఖాళీలు, పార్టీ పదవుల్లో మార్పులు, ప్రభుత్వంలో పునర్వ్యవస్థీకరణపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News