Pavan Chandragiri September 1, 2026
- నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్..
- బాధిత కుటుంబానికి పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని వినతి
చెన్నూరు, ఆంధ్రప్రభ : హైదరాబాద్ తుక్కుగూడలో గిరిజన నర్సు ఊకే శిరీష దారుణ హత్యకు నిరసనగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఆదివాసీ గిరిజనులు మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
శాంతియుతంగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు కొవ్వొత్తులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ.. ఊకే శిరీష హత్య ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
శిరీష హత్య కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, సాధ్యమైనంత త్వరగా న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శిరీష కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
