Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Siberia-Plague-Scare : ప్లేగు కలకలం .! Andhra Prabha Top News

Babu Bahadur October 5, 2026

Siberia-Plague-Scare : ప్లేగు కలకలం …! Andhra Prabha Top News

  • సైబీరియాలో కలవరం
  • ప్లేగు ల్యాబ్‌లో సైంటిస్ట్ మృతి
  • 28 ఏళ్ల శాస్త్రవేత్తకు తీవ్ర న్యూమోనియా
  • వందల మందిపై నిఘా
  • మూడు ఆసుపత్రుల్లో క్వారంటైన్‌ చర్యలు
  • ప్లేగు నిర్ధారణ కాలేదన్న అధికారులు
  • విరిగిన టెస్ట్‌ ట్యూబ్
  • ల్యాబ్‌లో ఏం జరిగింది?

(మాస్కో , ఆంధ్రప్రభ ప్రతినిది)

సైబీరియాలోని ఓ ప్లేగు పరిశోధనా కేంద్రంలో పనిచేసే 28 ఏళ్ల మహిళా పరిశోధకురాలు తీవ్ర న్యూమోనియాతో మృతి చెందడం రష్యాలో కలకలం రేపుతోంది. ప్రమాదకర బ్యాక్టీరియాకు ఆమె అనుకోకుండా గురై ఉండొచ్చన్న అనుమానాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమెతో సంబంధం ఉన్న వందల మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచడంతోపాటు క్వారంటైన్‌ చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనకు ప్లేగు కారణమైందని రష్యా అధికారులు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు.
ఇర్కుట్స్క్‌ యాంటీ-ప్లేగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న దర్యా షిపిలోవా అనే పరిశోధకురాలు సెప్టెంబరు 29న తీవ్ర న్యూమోనియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే చికిత్స పొందుతూ రెండు రోజులకే ఆమె మృతి చెందారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో.. అసలు ఆమెకు ఏం జరిగింది? ల్యాబొరేటరీలో ప్రమాదం జరిగిందా? ఏదైనా ప్రమాదకర వ్యాధికారక క్రిమికి ఆమె గురయ్యారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విరిగిన టెస్ట్‌ ట్యూబ్‌..?

వార్తా కథనాల ప్రకారం.. షిపిలోవా ఇర్కుట్స్క్‌ యాంటీ-ప్లేగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పొరుగున ఉన్న బుర్యాతియాలో ఉన్న సమయంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రాంతం మంగోలియా సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. ఆమె ఆసుపత్రి సిబ్బందికి చెప్పినట్లు పేర్కొంటున్న వివరాల ప్రకారం.. సజీవ బ్యాక్టీరియాతో ఉన్న ఓ టెస్ట్‌ ట్యూబ్‌ ప్రమాదవశాత్తూ పగిలిపోయినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆమె అనారోగ్యానికి గురయ్యారా? అన్నదానిపై ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వివరాలను రష్యా అధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు.

వందల మందిపై నిఘా

పరిశోధకురాలితో సన్నిహితంగా మెలిగినవారు, ఆమెకు చికిత్స అందించిన సిబ్బంది తదితరులను అధికారులు గుర్తించే పనిలో పడ్డారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. షెలెఖోవ్‌ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించిన సమయంలో ఆమెతో సంబంధం ఉన్న దాదాపు 200 మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు సమాచారం. ఈ ప్రాంతంలోని మరో రెండు ఆసుపత్రుల్లోనూ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు కథనాలు వెలువడ్డాయి.
అయితే ఇప్పటివరకు విస్తృత స్థాయిలో వ్యాధి వ్యాప్తి చెందినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇర్కుట్స్క్‌ గవర్నర్‌ ఇగోర్‌ కోబ్జెవ్‌ మాట్లాడుతూ.. గుర్తించిన వారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని, వారిలో ఎవరికీ వ్యాధి లక్షణాలు కనిపించలేదని తెలిపారు. నిర్వహించిన ప్రయోగశాల పరీక్షల్లోనూ ఇప్పటివరకు ప్రతికూల ఫలితాలే వచ్చాయని చెప్పారు. ల్యాబొరేటరీకి సమీపంలోని ఓ అల్యూమినియం కర్మాగారం కూడా ముందు జాగ్రత్తగా ఉద్యోగులు మాస్కులు ధరించాలని ఆదేశించింది. అయితే పుకార్లు, పరస్పర విరుద్ధమైన వార్తలను నమ్మవద్దని సంస్థ యాజమాన్యం స్థానికులను కోరింది.

అసలు ప్లేగేనా?

ఈ వ్యవహారంలో అందరినీ వేధిస్తున్న ప్రధాన ప్రశ్న ఇదే. షిపిలోవా మృతికి నిజంగా ప్లేగు కారణమా? పొరుగున ఉన్న బుర్యాతియా ప్రాంత అధిపతి అలెక్సీ సిడెనోవ్‌.. ఆమె ''బహుశా ప్లేగుతోనే'' మృతి చెంది ఉండొచ్చని వ్యాఖ్యానించారు. అదే సమయంలో బుర్యాతియాలో ఎలాంటి ప్లేగు వ్యాప్తి లేదని కూడా స్పష్టం చేశారు.
రష్యా వినియోగదారుల హక్కులు, ప్రజారోగ్య పర్యవేక్షణ సంస్థ రోస్పోట్రెబ్నాడ్జోర్‌ మాత్రం ఇప్పటివరకు ప్లేగును నిర్ధారించలేదు.
ఆ సంస్థకు గతంలో అధిపతిగా పనిచేసిన గెన్నడీ ఒనిష్చెంకో.. ఈ ఇన్ఫెక్షన్‌ ప్లేగు కాకపోయే అవకాశమే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఒకవేళ ప్లేగు నిర్ధారణ అయినా.. చల్లటి వాతావరణం కారణంగా వ్యాధి వ్యాప్తి అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
దీంతో అధికారుల భరోసా కలిగించే ప్రకటనలకు, ఘటనపై వెలువడుతున్న ఆందోళనకర కథనాలకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది.
ప్లేగు పరిశోధనా కేంద్రం కావడంతో.. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రదేశమే ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇర్కుట్స్క్‌ యాంటీ-ప్లేగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రమాదకర అంటువ్యాధులపై పరిశోధనలు, పర్యవేక్షణ చేసే ప్రత్యేక కేంద్రం.
అందుకే సజీవ బ్యాక్టీరియా ఉన్న టెస్ట్‌ ట్యూబ్‌ పగిలిందన్న వార్తలు మరింత కలకలం రేపుతున్నాయి. పరిశోధకురాలు ఏదైనా ప్రమాదకర వ్యాధికారక క్రిమికి గురయ్యారా? ప్రయోగశాలలో భద్రతా నిబంధనల్లో ఏదైనా లోపం జరిగిందా? అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు ల్యాబొరేటరీలో ఏం జరిగిందన్న పూర్తి వివరాలు ఎప్పటికీ బయటకు రాకపోవచ్చన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఘటనను అధికారులు పూర్తిగా వెల్లడించడం లేదన్న ఆరోపణలకు ఆజ్యం పోసింది. అయితే వీటికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

కొవిడ్‌ మూలాల తో పోలికలు

రష్యాకు చెందిన ఓ అనామక రాజకీయ టెలిగ్రామ్‌ ఛానల్‌ ఈ ఘటనను కొవిడ్‌-19 మూలాలపై గతంలో జరిగిన వివాదాలతో పోల్చింది. అయితే ఈ పోలికలు, ల్యాబొరేటరీలో ఏదైనా దాచిపెట్టారన్న ఆరోపణలు ఇప్పటివరకు నిర్ధారణ కానివే.
రంగంలోకి మాస్కో పెద్దలు ఘటన తీవ్రత నేపథ్యంలో రష్యా కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దేశ ప్రధాన శానిటరీ అధికారి అన్నా పొపోవా మాస్కో నుంచి నేరుగా సైబీరియాకు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
''అత్యంత ప్రమాదకర అంటువ్యాధి'' అనుమానిత కేసు గురించి సమాచారం అందిన అనంతరం ప్రాంతీయ శానిటరీ, అంటువ్యాధుల నియంత్రణ కమిషన్‌ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పొపోవా కూడా పాల్గొన్నట్లు గవర్నర్‌ కోబ్జెవ్‌ తెలిపారు. మొదట్లో అధికారులు అనుమానిస్తున్న వ్యాధి పేరును మాత్రం వెల్లడించలేదు.
షెలెఖోవ్‌ మేయర్‌ మాక్సిమ్‌ మోడిన్‌ కూడా ప్రజలు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, పుకార్లను వ్యాప్తి చేయవద్దని కోరారు. ఈ దశలో ఎలాంటి తుది నిర్ణయాలకు రావడం తొందరపాటేనని పేర్కొన్నారు.

న్యూమోనిక్‌ ప్లేగు అంటే?

ప్లేగు వ్యాధికి కారణమయ్యే యెర్సీనియా పెస్టిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే మూడు ప్రధాన రూపాల్లో న్యూమోనిక్‌ ప్లేగు ఒకటి. సాధారణంగా ఈ రూపం ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. బుబోనిక్‌ ప్లేగు ప్రధానంగా సోకిన ఈగల ద్వారా వ్యాపిస్తే.. న్యూమోనిక్‌ ప్లేగు శ్వాసకోశాన్ని ప్రభావితం చేస్తుంది. దగ్గు, తుమ్ము వంటి సందర్భాల్లో వెలువడే శ్వాసకణాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. జ్వరం, తలనొప్పి, తీవ్రమైన నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపించవచ్చు. తీవ్రస్థాయిలో రక్తం లేదా నీరు కలిసిన కఫం కూడా రావచ్చు. చికిత్స అందకపోతే ప్లేగు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అయితే సకాలంలో గుర్తించి తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే వ్యాధిని సమర్థంగా నియంత్రించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. ఇప్పటికైతే.. రష్యాలో ప్లేగు వ్యాప్తి జరిగిందని నిర్ధారణ లేదు. అయితే ప్రమాదకర అంటువ్యాధులపై పరిశోధనలు జరిగే కేంద్రంలోనే ఓ పరిశోధకురాలు తీవ్ర న్యూమోనియాతో మృతి చెందడం, వందల మందిని పర్యవేక్షణలో ఉంచడం మాత్రం ఆందోళనకు కారణమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News