Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
దుకాణాల్లో విస్తృత తనిఖీలు..
నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేపట్టి ప్లాస్టిక్ వినియోగాన్ని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్న పలువురు వ్యాపారులను గుర్తించి జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు డ్రైనేజీలు, కాలువలు, మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తకుప్పల్లో పేరుకుపోయి పారిశుద్ధ్య సమస్యలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు.
పట్టణంలోని హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, కిరాణా దుకాణాలు, కూరగాయలు, పండ్ల వ్యాపారులు, ఇతర వాణిజ్య సంస్థల యజమానులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచించారు. వినియోగదారులు కూడా ప్లాస్టిక్ కవర్లకు బదులుగా వస్త్ర సంచులు, జనపనార సంచులు, ఇతర పునర్వినియోగ సంచులను వినియోగించాలని కోరారు.
ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వ్యాపారులు తమ వద్దకు వచ్చే వినియోగదారులకు ప్లాస్టిక్ కవర్లు ఇవ్వకుండా అవగాహన కల్పించాలని సూచించారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలు, వ్యాపారులు మున్సిపాలిటీకి సహకరించాలని కమిషనర్ కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు ఇకముందు కూడా నిరంతరం కొనసాగుతాయని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిబంధనల ప్రకారం జరిమానాలతో పాటు తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
