Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

తెలంగాణ మట్టి బిడ్డల స్ఫూర్తితోనే జనసేన ఆవిర్భావం

Nagamani Malligari October 4, 2026prabhanews.com

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ గడల శ్రీనివాసరావు
చౌటుప్పల్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన సన్నాహక సమావేశం

చౌటుప్పల్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ మట్టి బిడ్డల పోరాట స్ఫూర్తితోనే జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ సారథ్యంలో ఈ నేలపైనే ఆవిర్భవించిందని ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జ్యోతి ప్రజ్వలనతో సమావేశం ప్రారంభమైంది.

గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం 1,200 మంది తెలంగాణ యువత ప్రాణత్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ హామీలను విస్మరించి ఫామ్‌హౌస్‌కే పరిమితమైందని విమర్శించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఆరు గ్యారంటీల పేరుతో 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500, స్కూటీలు, తులం బంగారం, వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. పెన్షన్లను రూ.4 వేలకు, రైతు భరోసాను రూ.15 వేలకు పెంచుతామని చెప్పి అమలు చేయలేదని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అందరికీ చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా 20 శాతం హామీలను కూడా అమలు చేయలేదని గడల శ్రీనివాసరావు విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలను గొర్రెలనుకుంటున్నారా అని నిలదీశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ అరణ్యవాసం, మూడేళ్ల కాంగ్రెస్‌ అజ్ఞాతవాసం పూర్తయ్యాయని, ప్రజల తరఫున గళమెత్తేందుకు జనసేన రంగంలోకి దిగిందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం జనసేనతోనే సాధ్యమని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీకి సెమీఫైనల్స్‌ వంటివని వ్యాఖ్యానించారు. పవన్‌ కళ్యాణ్‌ త్వరలోనే తెలంగాణకు వస్తున్నారని, పట్టభద్రులు జనసేనను గెలిపించాలని కోరారు.

రూ.లక్ష విరాళం ప్రకటించిన ఆముదాల పరమేశ్‌

ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం కోసం జనసేన ఉమ్మడి జిల్లా నాయకుడు ఆముదాల పరమేశ్‌ రూ.లక్ష చెక్కును విరాళంగా వేదికపై అందజేశారు. సిద్ధాంతాల కోసం పార్టీని స్థాపించిన పవన్‌ కళ్యాణ్‌కు పట్టభద్రులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన నాయకులను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో జనసేన తెలంగాణ జాయినింగ్‌ కమిటీ కన్వీనర్‌ మమ్మురెడ్డి ప్రేమ్‌కుమార్‌, రాష్ట్ర నాయకులు మచ్చ సుధాకర్‌, శర్మ, శిరీష, ప్రజిత్‌ గౌడ్‌, మిర్యాల రామకృష్ణ, శివ కార్తీక్‌, లక్ష్మణ్‌ గౌడ్‌, పీక ప్రవీణ్‌, మామిడాల రమేశ్‌, శ్రీకాంత్‌, లింగస్వామి, బద్రిరాజు, పాండు, ప్రవీణ్‌ తదితర జనసైనికులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News