Bala Raju September 2, 2026prabhanews.com, Telangana, TG News
బస్టాండ్ క్యాంటీన్ పునరుద్ధరణకు అధికారుల చర్యలు షురూ..
త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి క్యాంటీన్..?
మూతపడిన క్యాంటీన్‌పై అధికారుల దృష్టి..
TG | మెట్‌పల్లి, సెప్టెంబర్ 2 (ఆంధ్రప్రభ): మెట్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో మూతపడి ఉన్న క్యాంటీన్‌ను పునరుద్ధరించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. బస్టాండ్‌లో కొనసాగుతున్న "సబ్-టెండర్ల" వ్యవహారం, పారిశుధ్య సమస్యలు, మూతపడిన క్యాంటీన్ అంశాలపై ఆంధ్రప్రభలో ఇటీవల ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్‌లో క్యాంటీన్‌ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కథనంలో ప్రస్తావించడంతో అధికారులు దీనిపై దృష్టి సారించారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న క్యాంటీన్‌ను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
బస్టాండ్‌కు ప్రతిరోజూ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు… అయితే క్యాంటీన్ మూతపడటంతో ప్రయాణికులు తినుబండారాలు, టీ, తదితర అవసరాల కోసం బయట ఉన్న దుకాణాలపై ఆధారపడాల్సి వస్తోంది. కొన్ని సందర్భాల్లో అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. క్యాంటీన్ పునరుద్ధరణతో ప్రయాణికులకు సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారం, తాగునీరు, ఇతర తినుబండారాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
ఇతర సమస్యలపైనా చర్యలు తీసుకోవాలి..
కేవలం క్యాంటీన్ పునరుద్ధరణకే పరిమితం కాకుండా బస్టాండ్‌లో కొనసాగుతున్న టెండర్ నిబంధనల ఉల్లంఘనలు, సబ్-టెండర్ల ఆరోపణలు, అనుమతులకు భిన్నంగా జరుగుతున్న వ్యాపారాలు, పారిశుధ్య సమస్యలపైనా అధికారులు సమగ్ర చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆంధ్రప్రభ కథనానికి స్పందించి క్యాంటీన్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించడం అభినందనీయమని, ఇదే తరహాలో బస్టాండ్‌లోని అన్ని సమస్యలను పరిష్కరించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. మాటలకే పరిమితం కాకుండా.. చర్యల్లోనూ మార్పు కనిపిస్తేనే బస్టాండ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
