Bala Raju September 3, 2026prabhanews.com, Telangana, TG News
ఎనిమిది చోట్ల ఏకకాలంలో తనిఖీలు..
గంజాయి విక్రయాలతో కోట్లాది రూపాయలు ఆర్జించినట్లు ఆరోపణలు
TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో గంజాయి అక్రమ విక్రయాల వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీతు భాయ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నీతు భాయ్‌పై ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
గంజాయి విక్రయాల ద్వారా నీతు భాయ్ కోట్లాది రూపాయలు సంపాదించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ అక్రమ ఆదాయాన్ని హవాలా మార్గంలో తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతో గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన డబ్బు ఎక్కడికి తరలించారు? ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ క్రమంలో నీతు భాయ్‌కు సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. పలు పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయి అక్రమ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయం, దాని తరలింపు, ఆస్తుల కొనుగోళ్లపై కూడా దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు, ఇతర ఆధారాలకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.
