Bala Raju September 3, 2026prabhanews.com, Telangana, TG News
వెదురు బొంగుల కోసం వెళ్లిన ఆదివాసీ మృతి..
గిరిజనుల్లో భయాందోళన
TG | నూగురు వెంకటాపురం, సెప్టెంబర్ 3 ఆంధ్రప్రభ: ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు గతంలో అమర్చినట్లు అనుమానిస్తున్న ఐఈడీ (మందుపాతర) పేలి ఓ ఆదివాసీ మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
ఎదుర్ల చెరువు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావు వెదురు బొంగుల సేకరణ కోసం పామనూరు సమీప అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు అతనితోపాటు వెళ్లిన మరికొందరు వెల్లడించారు.
మూడు రోజుల క్రితం నాగేశ్వరరావు మరో కొందరుతో కలిసి అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా మందుపాతర పేలినట్లు తెలుస్తోంది. పేలుడు ఘటనపై ముందస్తు సమాచారం గ్రామస్తులకు లేకపోవడంతో సహచరులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు.
మందుపాతరలు ఇంకా ఉన్నాయా?
కర్రెగుట్ట ప్రాంతంలో గతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు ఇంకా ఉండే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహదారి నిర్మాణ పనుల అనంతరం కూడా ఐఈడీ పేలుళ్లు చోటుచేసుకోవడం, అమాయక ఆదివాసీలు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
అడవికి వెళ్లాలంటే భయం..
కర్రెగుట్ట ప్రాంతంలోని గిరిజనులు పశువులను మేతకు తీసుకెళ్లడంతో పాటు నిత్యావసరాల కోసం వెదురు బొంగులు, అటవీ ఉత్పత్తుల సేకరణకు అడవిపై ఆధారపడుతున్నారు. అయితే ఇలాంటి పేలుళ్లు పునరావృతం కావడంతో అడవిలోకి వెళ్లేందుకు గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు.
కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేసి, ప్రమాదకరమైన మందుపాతరలు ఏమైనా ఉంటే గుర్తించి తొలగించడంతో పాటు గిరిజనులకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
