Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

TG | సమ్మె నోటీసుకు దిగొచ్చిన సింగరేణి..!

Bala Raju August 28, 2026prabhanews.com, Telangana, TG News

  • ఏఐటీయూసీ ఒత్తిడితో కార్మికుల పలు డిమాండ్లపై అంగీకారం, కీలక ఒప్పందాలు
  • పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్‌ను యాజమాన్యం భరించేందుకు అంగీకారం
  • ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించేందుకు సుముఖత
  • కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత ప్రాధాన్యత దిశగా సంఘం ఏఐటీయూసీ
  • యూనియన్ నిరంతర పోరాటం కీలక విజయాన్ని అందించింది అంటున్న నేతలు
  • జూన్ 8 నాటి సమ్మె నోటీసు పై ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చలు సఫలం

TG | (మంచిర్యాల ప్రతినిధి - ఆంధ్రప్రభ) ; సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన ఏఐటీయూసీ సమ్మె నోటీసుకు యాజమాన్యం దిగొచ్చింది. శుక్రవారం జరిగిన చర్చల్లో సానుకూలంగా స్పందించింది. కోల్ ఇండియా లాగే కార్మికులకు లభించే అలవెన్సులు, పెర్క్స్‌ పై విధించే ఇన్‌కమ్ ట్యాక్స్ భరిస్తామని అంగీకరించింది. సర్వీసులో సహజ మరణం పొందిన గని కార్మికుడి కుటుంబానికి 20 లక్షలు ఇస్తామని వెల్లడించింది. మెడికల్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను దసరాలోపు ప్రకటించేందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని చర్యలు చేపడతామంది. బదిలీల్లో మూడేళ్ల సర్వీస్ నిబంధనను తొలగించి ఖాళీల ఆధారంగా సంవత్సరం నిబంధనతో ట్రాన్స్‌ఫర్లు చేపట్టేందుకు సిద్దం అంది. వీటితో పాటు మైనింగ్ స్టాఫ్‌లో సీనియర్ మైనింగ్ సర్ధార్లుగా పని చేస్తున్న అర్హులైన ఉద్యోగులకు సకాలంలో ఫోర్‌మెన్ ప్రమోషన్లు కల్పించేందుకు యాజమాన్యం అంగీకరించింది.

మారుపేర్ల సమస్యకు కమిటీ..

సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్యపై మార్గదర్శకాలు పాటిస్తూ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ కమిటీలో యూనియన్ సంఘాలకు కూడా భాగస్వామ్యం కల్పించినట్లు వెల్లడించింది. కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. 22 ఏళ్ళుగా మార్పులేని మెడికల్ అటెండెన్స్ నిబంధనలను సవరించేందుకు అంగీకరించింది. సర్వీసు నుంచి దిగిపోయిన కార్మికులకు ఓపీ సేవలతో పాటు వారం రోజుల వరకు చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటామంది. గనుల్లో కార్మికుల భద్రతకు అవసరమైన సేఫ్టీ మెటీరియల్‌ను సకాలంలో అందుబాటులో ఉంచుతామని చెప్పింది. మందమర్రి - క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో పని చేస్తున్న కార్మికులకు 9 శాతం ఇంటి అద్దె అలవెన్సు అందించే అంశం పై అంగీకరించింది. డిసిప్లినరీ యాక్షన్ కింద పెండింగ్‌లో ఉన్న డిస్మిస్ కేసులను పరిష్కరిస్తామని చెప్పింది.

కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఈఎస్ఐ వైద్యం

సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఈఎస్ఐ వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకుంటామని అంగీకరించింది. పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల కేసులను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఈవెనింగ్ కాలేజీల్లో చదువుకోవడానికి అవసరమైన ఎన్ఓసీలు జారీ చేస్తామని తెలిపింది. ఖాళీగా ఉన్న క్లరికల్, ఎస్అండ్ పీసీ, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, పారా మెడికల్, సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రికల్, మెకానికల్ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి అంగీకరించింది. ఈపీ, ఫిట్టర్లు, క్లాంప్ ఫిట్టర్లు, సర్వేయర్లు తదితర క్యాడర్ స్కీమ్‌కు సంబంధించిన సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపింది. మెడికల్ ఫిట్ అయినప్పటికీ పెండింగ్‌లో ఉన్న 149 మంది డిపెండెంట్లకు నెలలోగా రోజుల్లోపు ఆఫీస్ ఆర్డర్లు జారీ చేసేందుకు అంగీకరించింది. కార్మికులకు సొంత ఇంటి పథకం కింద 250 గజాల స్థలం కల్పించే అంశంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది.

ఏఐటీయూసీ చారిత్రాత్మక విజయం..

కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసు, ఆర్‌ఎల్‌సీ సమక్షంలో జరిగిన చర్చలు, యాజమాన్యంపై కొనసాగించిన నిరంతర ఒత్తిడి ఫలితంగానే పలు కీలక అంశాలపై యాజమాన్యం అంగీకారానికి వచ్చిందని ఏఐటీయూసీ సీనియర్ నేత సీతారామయ్య, శ్రీరాంపూర్ ఏరియా నాయకులు రాజేశ్వర్ నాయకులు తెలిపారు. పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్, సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి 20 లక్షలు, మెడికల్ బోర్డు ప్రతి నెల నిర్వహణ, లాభాల ప్రకటన, ట్రాన్స్‌ఫర్ నిబంధనల మార్పు, ప్రమోషన్లు, వైద్య సదుపాయాలు, ఖాళీ పోస్టుల భర్తీ, డిపెండెంట్ ఉద్యోగాలు తదితర అనేక కీలక సమస్యలపై సాధించిన ఈ అంగీకారాలు సింగరేణి కార్మికుల పోరాట చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం, హక్కుల సాధనే ఏఐటీయూసీ ధ్యేయమని వారు స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News