Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Tirupati | 16 మందికి గాయాలు.

Bala Raju August 28, 2026andhra pradesh, ap, AP news, prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

చెంబడిపాళెం సమీపంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న కట్టెల లోడు లారీని కర్ణాటక ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

బెంగళూరు నుంచి నెల్లూరు వైపు ప్రయాణిస్తున్న వోల్వో బస్సు చెంబడిపాళెం సమీపానికి చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. జాతీయ రహదారిపై నిలిచి ఉన్న కట్టెల లోడు లారీని బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒక్కసారిగా ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండటంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు నెల్లూరుకు తరలించినట్లు సమాచారం. మిగిలిన క్షతగాత్రులకు నాయుడుపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

ఈ ఘటనపై ఎస్ఐ ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి అతివేగమా, లేక ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News