Sowjanya Anneboina September 23, 2026prabhanews.com
- ఉయ్యాలలోని పసికందుకు మట్టి పెళ్లల నుంచి రక్షణ
ఊట్కూర్, ఆంధ్రప్రభ : వర్షానికి ఇంటి పైకప్పు కూలడంతో ఉయ్యాలలో ఉన్న నెల రోజుల పసికందుపై మట్టి పెళ్లలు పడిన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో చిన్నారిని ఇరుగుపొరుగు వారు సురక్షితంగా బయటకు తీయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లోని సామాగ్రి, దుస్తులు మట్టిలో కూరుకుపోవడంతో సుమారు రూ.40 వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత కుటుంబం తెలిపింది.
గ్రామస్తుల కథనం ప్రకారం.. పులిమామిడి గ్రామానికి చెందిన వడ్డె రంగమ్మకు మగ సంతానం లేకపోవడంతో ఆమె కుమార్తె లోకేశ్వరి కుటుంబంతో కలిసి ఇంట్లో నివసిస్తోంది. లోకేశ్వరి నెల రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం రాత్రి గ్రామంలో వర్షం కురుస్తున్న సమయంలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో చిన్నారిని ఇంట్లో చీరతో ఏర్పాటు చేసిన ఉయ్యాలలో నిద్రపుచ్చారు.ఇంటి పైకప్పు కూలిన శబ్దం విని కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు అప్రమత్తమై ఇంట్లోకి వెళ్లి చూడగా చిన్నారిపై మట్టి పడినట్లు గుర్తించారు.
దీంతో కుటుంబ సభ్యులు కేకలు వేయగా, చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి మట్టిని తొలగించి చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. సకాలంలో స్పందించడంతో పసికందుకు ప్రాణాపాయం తప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఇంట్లోని సామాగ్రి, దుస్తులు మట్టిలో కూరుకుపోయాయి. దీంతో సుమారు రూ.40 వేల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని గ్రామ సర్పంచ్ త్రివేణి చెన్నప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణమే సహాయం అందించి, నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని కోరారు.
