Pavan Chandragiri September 1, 2026
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు అంశంపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కీలక చర్చలు జరిగాయి.
ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన బ్యారేజ్ నిర్మాణం, సాంకేతిక అంశాలు, అంతర్రాష్ట్ర సమస్యలపై న్యూఢిల్లీలోని సేవా భవన్‌లో కేంద్ర జల సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం ముగిసింది.
తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ భేటీలో ప్రధానంగా బ్యారేజ్ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచే ప్రతిపాదనపైనే చర్చ సాగింది. ఇరు రాష్ట్రాల వాదనలు, సాంకేతిక అంశాలను పరిశీలించిన అనంతరం మూడు వారాల తర్వాత మరోసారి సమావేశం కావాలని కేంద్ర జల సంఘం నిర్ణయించింది.
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు 148 మీటర్లుగా గతంలో మహారాష్ట్ర అంగీకరించింది. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆ ఎత్తును 152 మీటర్లకు పెంచాలని కోరుతోంది. 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మిస్తే గురుత్వాకర్షణ ద్వారా నీటిని తరలించడం సాధ్యం కాదని తెలంగాణ అధికారులు సమావేశంలో వివరించారు. దీంతో నీటిని తరలించేందుకు భారీ సామర్థ్యం కలిగిన పంపులను వినియోగించాల్సి వస్తుందని, ఫలితంగా విద్యుత్ వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
బ్యారేజ్ ఎత్తును 152 మీటర్లకు పెంచితే సుమారు 80 టీఎంసీల నీటిని గురుత్వాకర్షణ ద్వారా సుందిళ్ల బ్యారేజ్‌కు తరలించే అవకాశం ఉంటుందని తెలంగాణ అధికారులు కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. పంపింగ్‌పై ఆధారపడాల్సిన అవసరం తగ్గడంతో విద్యుత్ ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని వివరించారు. ప్రాజెక్టు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 152 మీటర్ల ఎత్తు అవసరమని తెలంగాణ తన వాదనను వినిపించింది.
బ్యారేజ్ ఎత్తు పెంచితే మహారాష్ట్రలో ముంపు సమస్య తలెత్తుతుందన్న అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. కేంద్ర జల సంఘం పరిధిలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ అధ్యయనాలను తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. 152 మీటర్లకు ఎత్తు పెంచినప్పటికీ మహారాష్ట్రలోని గ్రామాలకు అదనంగా ముంపు ముప్పు ఉండదని, నదీ గర్భం మాత్రమే ముంపునకు గురవుతుందని వారు వివరించారు.
ఇదే సమయంలో గతంలో జరిగిన ఒప్పందాలను కూడా తెలంగాణ ప్రభుత్వం… కేంద్ర జల సంఘం ముందుంచింది. 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య 152 మీటర్ల ఎత్తుపై జరిగిన ఒప్పందాన్ని ప్రస్తావించింది. అనంతరం 2016లో బ్యారేజ్ ఎత్తును 148 మీటర్లకు తగ్గించడం వల్ల తెలంగాణకు ఎదురైన ఇబ్బందులను కూడా వివరించింది. గత ఒప్పందాన్ని సవరించి 152 మీటర్ల ఎత్తుకు అనుమతి ఇవ్వాల్సిన అవసరాన్ని వివరిస్తూ తెలంగాణ అధికారులు నివేదిక సమర్పించారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చి.. సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలకు పరిష్కారం కనుగొనే దిశగా కేంద్ర జల సంఘం ఈ చర్చలను కొనసాగిస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన, కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించడంలో ప్రాజెక్టు కీలకంగా మారుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జలశక్తి మంత్రికి లేఖలు రాస్తూ తుమ్మిడిహెట్టి అంశాన్ని పరిష్కరించాలని కోరిన నేపథ్యంలో ఈ సంయుక్త సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా జరిగిన భేటీలో తుది నిర్ణయం తీసుకోకపోవడంతో.. మూడు వారాల తర్వాత మరోసారి సమావేశమై సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై మరింత చర్చించాలని కేంద్ర జల సంఘం నిర్ణయించింది.
