Sowjanya Anneboina August 22, 2026prabhanews.com
ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వాలి
తెలంగాణ ప్రజా ఫ్రంట్ డిమాండ్
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై సమగ్ర చర్చ జరిపి, ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తూ బలమైన విధానాన్ని రూపొందించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కమిటీ కోరింది.
ఆదివారం హన్మకొండలోని వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్న బహిరంగ చర్చా వేదికకు సంబంధించిన కరపత్రాలను శనివారం పెద్దపల్లిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుమ్మడి కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శి గాండ్ల మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి పులిపాక రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు చేసిన త్యాగాలు చారిత్రాత్మకమైనవని అన్నారు. రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ఉద్యమకారుల సమస్యలు, నిరుద్యోగం, ఖాళీ పోస్టుల భర్తీ, యువతకు ఉపాధి అవకాశాల వంటి అంశాలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
ఉద్యమకారులకు ఉపాధి, ఇళ్ల స్థలాలు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నాయకులు కోరారు. ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉద్యోగుల కమిటీ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ చర్చకు ఉద్యమకారులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.
తమ సమస్యలు, అభిప్రాయాలను వేదికపై వెల్లడించాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యమకారుల సమస్యలకు పరిష్కారం చూపే విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కంపల్లి అంజన్న, కె. రాజు, రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, సామాజిక ఉద్యమకారులు రామిల్ల బాపు, మంచినీళ్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
