Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఉల్లి ధరలకు కళ్లెం.. కిలో రూ.35కే ఉల్లిగడ్డలు

Rama Rao September 1, 2026Onion Price Hike

ఢిల్లీలో 1,000 టన్నుల ఉల్లిని అందించనున్న కేంద్రం
13 జిల్లాల్లో మొబైల్‌ వాహనాలతో విక్రయాలు..

ధరల పెరుగుదల, కొరతను అడ్డుకునేందుకు చర్యలు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీకి 1,000 మెట్రిక్‌ టన్నుల ఉల్లిని సరఫరా చేయనుంది. వీటిని న్యాయధర దుకాణాల ద్వారా కిలో రూ.35కే విక్రయించనున్నారు. దీంతో ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కొంత ఊరట లభించనుంది. ఉల్లిని మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఢిల్లీలోని 13 జిల్లాల్లో ఒక్కో మొబైల్‌ వాహనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆయా వాహనాలు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ కిలో రూ.35 చొప్పున ఉల్లిని విక్రయిస్తాయి. న్యాయధర దుకాణాలకు వెళ్లే అవకాశం లేని వారికి కూడా ఈ విధానం ప్రయోజనం కలిగించనుంది.

ఢిల్లీలో ఉల్లి ధరలు, లభ్యతపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. రాజధానిలో కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటు ధరల్లో లభించేలా చూస్తామని చెప్పారు. ధరలు మరింత పెరిగితే అదనపు భారాన్ని ప్రజలపై పడనివ్వబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆగస్టు 25న ఉల్లి, చక్కెర ధరలు, లభ్యతపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉల్లి, చక్కెరకు కొరత లేదని సమావేశంలో గుర్తించారు. ఒకవేళ ధరలు మరింత పెరిగితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నాఫెడ్‌ నుంచి ఉల్లి, చక్కెరను కొనుగోలు చేసి రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రవాణా, ఇతర ఖర్చులను ఢిల్లీ ప్రభుత్వమే భరించనుంది. మరోవైపు ఢిల్లీకి చేరుతున్న ఉల్లి సరఫరాను పర్యవేక్షించడం, మార్కెట్‌కు సక్రమంగా చేరేలా చూడటం, నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించకుండా అడ్డుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అవసరమైతే అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News