Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
- గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రహదారికి తాత్కాలిక మరమ్మతులు
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో వర్షాకాలంలో ఏర్పడిన గుంతలను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం పూడ్చివేశారు.
కాకతీయ కాలువ నుంచి కమ్మర్‌పల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చడంతో రాకపోకలకు ఇబ్బందులు తగ్గినట్లు గ్రామపంచాయతీ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను గ్రామపంచాయతీ సిబ్బందితో పూడ్చివేసినట్లు తెలిపారు.
ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా రహదారిని సౌకర్యవంతంగా మార్చేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గుంతల కారణంగా రహదారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గుంతలను పూడ్చివేసినట్లు సర్పంచ్ తెలిపారు. రహదారి సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. గుంతలను పూడ్చివేయడంపై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అజయ్ గౌడ్, అవారి సురేష్, విభూతి అనిల్, సాదుల్ల తదితరులు పాల్గొన్నారు.
