Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Uttar Pradesh Blast | ఫ్యాక్టరీ లోపలే 15 మంది కార్మికులు!

Bharath August 31, 2026prabhanews.com

  • 24 మందికి గాయాలు..
  • ఆరు ఇళ్లు ధ్వంసం
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

కౌశాంబి, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్‌: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో సుమారు 24 మంది గాయపడగా.. మరో 15 మంది వరకు కర్మాగారం లోపలే చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు. పిప్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మనోరి పవర్‌ హౌస్‌ సమీపంలో ఈ పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పేలుడు అనంతరం కర్మాగారంలో మంటలు చెలరేగగా.. అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపులోకి తీసుకొచ్చారు. కర్మాగారం లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కౌశాంబి జిల్లా మేజిస్ట్రేట్‌ అమిత్‌ పాల్‌ తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని ఘటనా స్థలం నుంచి రక్షించి మెరుగైన చికిత్స కోసం ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్‌ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

పేలుడు ధాటికి ఇళ్లు ధ్వంసం

పేలుడు తీవ్రతకు కర్మాగారానికి ఆనుకుని ఉన్న ఐదు నుంచి ఆరు ఇళ్లు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని ఇతర నిర్మాణాలు కూడా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఘటన స్థలానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో మనోరి వాయుసేన కేంద్రం ఉందని తెలిపారు. కౌశాంబి, ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతాల నుంచి వచ్చిన వాయుసేన, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు అధికారికంగా నిర్ధారించలేదని జిల్లా మేజిస్ట్రేట్‌ తెలిపారు. పేలుడుకు గల కారణం సహా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News