Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఉత్తరాదిలో భారీ వర్షాలు.. యూపీ, ఉత్తరాఖండ్‌లో వరదల కలకలం

Rama Rao September 1, 2026floods, Ganga River

పొంగిపొర్లుతున్న గంగా, యమునా..
లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు
డెహ్రాడూన్‌లో పాఠశాలలకు సెలవు..

నదీ తీరాల్లో అప్రమత్తమైన అధికారులు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. డెహ్రాడూన్‌, ప్రయాగ్‌రాజ్‌, వారణాసి సహా పలు ప్రాంతాల్లో నదుల నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సహాయక బృందాలను అప్రమత్తం చేశారు. డెహ్రాడూన్‌, పరిసర ప్రాంతాల్లో రాత్రంతా కురిసిన భారీ వర్షాలతో తపకేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయ ప్రాంగణం మీదుగా ప్రవహించే తామస నది ఉధృతంగా మారింది. నది నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ఆలయ పరిసరాల్లో పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో డెహ్రాడూన్‌ జిల్లాలో మంగళవారం ఒకటి నుంచి 12వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదుల నీటిమట్టాలు పెరుగుతున్నాయి. నదీ తీర ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో నివాస ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారణాసిలోనూ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గంగా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో పాటు ప్రముఖ ఘాట్ల వద్ద సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతోంది. రిషికేశ్‌లోనూ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గఢ్వాల్‌ ప్రాంతంలోని కొండ ప్రాంతాల్లో నిరంతర వర్షాల కారణంగా నీటిమట్టం పెరిగినప్పటికీ.. ప్రస్తుతం హెచ్చరిక స్థాయికి దిగువనే నది ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్రివేణి ఘాట్‌ వద్ద గంగా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో భక్తులు, పర్యాటకులు నది తీరాలకు వెళ్లకుండా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

రిషికేశ్‌, మునికీ రేతి, లక్ష్మణ్‌ఝులా ప్రాంతాల్లోని ప్రధాన ఘాట్ల వద్ద రాష్ట్ర విపత్తు స్పందన దళం, జల పోలీస్‌, విపత్తు సహాయక బృందాలను మోహరించారు. నదీ తీరాల్లో నిరంతరం మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News