Sowjanya Anneboina October 4, 2026prabhanews.com
- నేడు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభం
వైరా,ఆంధ్రప్రభ: వైరా వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పెసల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు తెలిపారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు మాట్లాడుతూ.. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కృషి, చొరవతో వైరా వ్యవసాయ మార్కెట్‌లో పెసల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే అధికారికంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.
వైరా నియోజకవర్గ పరిధిలో పెసల సాగు చేస్తున్న రైతులు తమ పంటను మార్కెట్‌లో విక్రయించుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు తమ పెసల పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు.
రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను విక్రయించుకోవాలని బోళ్ల గంగారావు కోరారు. పెసల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు రైతాంగం, మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మద్దతు ధరతో పంటను విక్రయించుకునే అవకాశం కల్పించడం ద్వారా కొనుగోలు కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్, డైరెక్టర్లు జాలాది తిరుపతిరావు, మోత్కూరి వెంకటేశ్వరరావు, రేచర్ల సత్యం, ఐవీ నాగేశ్వరరావు, రేచర్ల మల్లీశ్వరి తదితరులు పాల్గొంటారు.
