Rama Rao August 21, 2026Telangana
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలోని ఏడో వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ అంజుమ్ అలీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక శుభ్రత పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, కాలువలను శుభ్రం చేయడం, ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలను తొలగించడం వంటి పనులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ అంజుమ్ అలీ మాట్లాడుతూ.. ఏడో వార్డులోని ప్రతి కాలనీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వార్డులో పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
