Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

వర్షం వస్తే రాకపోకలకు బ్రేక్..

Madhav August 4, 2026

ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటుతున్న రైతులు కూలీలు

ఆరు జిల్లాలకు అనుసంధానం చేసే బ్రిడ్జిని నిర్మించాలి
రాకపోకలకు తక్కువ దూరం

రైతులకు రవాణా ఖర్చు తగ్గింపు
బోర్నపల్లి-కిష్టంపేట మధ్య మానేరు బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడూ?
వర్షాకాలంలో ప్రజలకు నరకయాతన.. దశాబ్దాలుగా నెరవేరని హామీ
ఆరు జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే వంతెనకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
టేకుమట్ల, ఆంధ్రప్రభ: భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బోర్నపల్లి గ్రామం, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై వంతెన నిర్మాణం లేకపోవడంతో రెండు జిల్లాల ప్రజలు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో మానేరు ఉప్పొంగి ప్రవహించినప్పుడు, అలాగే కరీంనగర్‌లోని ఎల్ఎండీ డ్యాం గేట్లు ఎత్తివేసిన సమయంలో వాగు ప్రమాదకరంగా మారడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి.
వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసే ప్రతి ఏడాది ఇదే సమస్య పునరావృతమవుతున్నా, ఇప్పటికీ శాశ్వత పరిష్కారం దొరకకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆరు జిల్లాలకు అనుసంధానం

ఈ వంతెన నిర్మాణం జరిగితే వరంగల్, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దూర ప్రాంతాల మీదుగా ప్రయాణించాల్సి వస్తుండటంతో సమయం, ఇంధనం రెండూ వృథా అవుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా పత్తి, మిర్చి వంటి పంటలను మార్కెట్లకు తరలించే రైతులకు ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల హామీగానే మిగిలిన బ్రిడ్జి

1994-99లో ఎమ్మెల్యేగా ఉన్న బిరుదు రాజమల్లు, 1999-2004లో గుజ్జుల రామకృష్ణారెడ్డి చిన్నరాతుపల్లి-పెద్దరాతుపల్లి గ్రామాల మధ్య వంతెన నిర్మాణం చేపట్టారు. అనంతరం 2004 ఎన్నికల సందర్భంగా కిష్టంపేట-బోర్నపల్లి మధ్య వంతెన నిర్మిస్తానని హామీ ఇచ్చినా అది అమలుకు నోచుకోలేదు.

తర్వాత వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించినప్పటికీ మానేరు వంతెన నిర్మాణం మాత్రం ముందుకు సాగలేదు. ప్రజలు ఎన్నో వినతిపత్రాలు సమర్పించినా హామీలు తప్ప పనులు ప్రారంభం కాలేదని స్థానికులు అంటున్నారు.

మట్టి రోడ్డే ఆధారం

వంతెన లేకపోవడంతో బోర్నపల్లి, కిష్టంపేట గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం పరస్పర సహకారంతో మానేరు వాగులో తాత్కాలికంగా మట్టి రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాల నుంచి స్వల్ప రుసుము వసూలు చేసి రోడ్డు నిర్వహణ చేపడుతున్నారు. దీంతో కొంత మేర దూరభారం తగ్గుతున్నప్పటికీ వర్షాలు పడగానే ఈ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి మళ్లీ రాకపోకలు నిలిచిపోతున్నాయి.

మంత్రులకు పలుమార్లు వినతులు

వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యాపారులు ఈ వంతెన కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

ప్రజల విజ్ఞప్తి

ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలోనైనా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ చింతకుంట విజయరమణారావు ప్రత్యేక చొరవ తీసుకుని మానేరు వాగుపై శాశ్వత వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహకారంతో ఈ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించి ఆరు జిల్లాల ప్రజలకు శాశ్వత రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News