Bala Raju October 24, 2026prabhanews.com
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
బిక్కనూర్, ఆంధ్రప్రభ: ప్రతి రైతు తన వ్యవసాయ భూమిలో ఫామ్ పాండ్ నిర్మించుకొని వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా సాగునీటి సమస్యలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
శనివారం మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రైతు సింగిని భిక్షపతి తన రెండెకరాల భూమిలో చేపట్టిన ఫామ్ పాండ్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.
కూలీలతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగు చేస్తూ, వర్షపు నీటిని ప్రతి చుక్కా ఒడిసిపట్టాలని తెలిపారు. ఫామ్ పాండ్లతో నీటి సంరక్షణతో పాటు భూగర్భ జలాల పెంపునకు అవకాశం ఉంటుందన్నారు. అనంతరం పెద్దమల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సందర్శించి, రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న శనగ విత్తనాలను పరిశీలించారు. విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వై.ఎన్. గిరి, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
