Nagamani Malligari September 2, 2026prabhanews.com
జుక్కల్ నియోజకవర్గానికి రూ.6 కోట్ల బకాయి..
బాకీ కార్డులను ఇంటింటికీ చేరుస్తాం: హన్మంత్ షిండే
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : ఎన్నికలకు ముందు ప్రజలకు మాయమాటలు చెప్పి, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే విమర్శించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం జుక్కల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద నియోజకవర్గ స్థాయి సమరభేరి, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, వివిధ కులాలకు సంబంధించిన 13 డిక్లరేషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, తులం బంగారం, రైతుబీమా, నిరుద్యోగ భృతి, దళితబంధు, రుణమాఫీ తదితర హామీల అమలు ఊసే లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
హామీలను అమలు చేయకపోవడంతో వాటికి సంబంధించిన రూ.6 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం జుక్కల్ నియోజకవర్గానికి బకాయి పడిందని హన్మంత్ షిండే ఆరోపించారు. ఈ బకాయిలకు సంబంధించిన బాకీ కార్డులను నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ పంపిణీ చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు.
జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నియంతృత్వ పాలన కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. బీఆర్‌ఎస్ సమరభేరి కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టెంట్లను సైతం పోలీసుల ద్వారా తొలగించారని విమర్శించారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని, అరకొరగా అమలవుతున్న సంక్షేమ పథకాల్లోనూ అర్హులైన బీఆర్‌ఎస్ కుటుంబాలకు ప్రయోజనాలు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ శ్రేణుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని హన్మంత్ షిండే విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ ఇన్‌చార్జి బిక్షపతి స్వామి, మాజీ జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజుతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వందలాదిగా పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ శ్రేణులు ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శించగా, దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను చిత్రీకరించారు.
