Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
నడిగూడెం, ఆంధ్రప్రభ : 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి విమర్శించారు.
మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం సెప్టెంబర్ 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 2న కోదాడలో నిర్వహించే ధర్నాకు మండలంలోని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పల్లా నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు ఐక్యంగా పోరాడాలని కోరారు. ఈ సమావేశంలో మండల సమన్వయ సమితి సభ్యులు అనంతుల ఆంజనేయులు, గార్లపాటి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీను, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎస్కే జలీల్, బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు మేకల వీరబాబు, నాయకులు వల్లెపు శ్రీను, తిరుమలి తదితరులు పాల్గొన్నారు.
