Nagamani Malligari October 24, 2026prabhanews.com
ఉపపీఠానికి చేరుకున్న యాత్రికులకు ఘన స్వాగతం
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : శ్రీ క్షేత్ర నానిచ్ ధామ్ దక్షిణపీఠ్ రత్నగిరి (మహారాష్ట్ర) పీఠాధిపతి శ్రీ జగద్గురు రామానందాచార్య నరేంద్రాచార్య జన్మదినాన్ని పురస్కరించుకుని వసుంధర దిండి పాదయాత్ర నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా వందలాది మంది భక్తులు, శిష్యులు గత నెల 27న జుక్కల్ మండల కేంద్రంలోని బంగారుపల్లి-దోస్పల్లి వద్ద ఉన్న తెలంగాణ ఉపపీఠం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, అరుణతార పాల్గొన్నారు.
శ్రీరామానంద సంప్రదాయాన్ని అనుసరిస్తూ క్రమశిక్షణతో సాగిన ఈ పాదయాత్రలో పర్యావరణ పరిరక్షణ, దేశభక్తి, సేవాగుణం, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించారు. వందలాది గ్రామాల్లో వేలాది మందికి పర్యావరణ పరిరక్షణ, ఆధ్యాత్మికత, దైవభక్తిపై అవగాహన కల్పించారు. ఈ నెల 21న పాదయాత్ర మహారాష్ట్రలోని నానిచ్ ధామ్ శ్రీ క్షేత్రానికి చేరుకుంది. అక్కడ శ్రీ జగద్గురువు రామానందాచార్య నరేంద్రాచార్య ఆధ్వర్యంలో భక్తులకు ఘన స్వాగతం లభించింది. స్వామీజీ దర్శనం చేసుకున్న భక్తులందరికీ జగద్గురువర్యులు ఆశీర్వాదాలు అందజేశారు.
28 రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర శనివారం జుక్కల్ ఉపపీఠానికి చేరుకుంది. ఈ సందర్భంగా జుక్కల్ ప్రజాప్రతినిధులు, ఉపపీఠం సేవా సమితి సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు తిరుగు పాదయాత్రికులకు ఘన స్వాగతం పలికారు. జుక్కల్ పురవీధుల గుండా శోభాయమానంగా సాగిన యాత్ర ఉపపీఠానికి చేరుకోవడంతో కార్యక్రమం ముగిసింది.
