Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
మత సామరస్యాన్ని కాపాడుతూ పోలీసులకు సహకరించాలి
పరకాల, ఆంధ్రప్రభ : వినాయక చవితి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ సంక్వార్ అన్నారు.
పండుగ సందర్భంగా శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు మంగళవారం పరకాలలో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ మతాలకు చెందిన పెద్దలు, ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీపీ అంకిత్ కుమార్ సంక్వార్ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మత సామరస్యాన్ని కాపాడుతూ ప్రశాంతమైన, సురక్షిత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని సూచించారు.
గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
