Nagamani Malligari September 2, 2026prabhanews.com
తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ 8వ రాష్ట్ర మహాసభలు..
16 డిమాండ్ల అమలుకు పిలుపు
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : వ్యవసాయ వృత్తిదారులు, అసంఘటిత కార్మికులకు స్థిరమైన జీవనోపాధి, ఆహార భద్రత, సామాజిక భద్రత కల్పించాలని తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ 8వ రాష్ట్ర మహాసభలను బుధవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టగళ్ల వెంకటయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడిన కూలీలు, చిన్న, సన్నకారు రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. సరైన ఉపాధి లభించకపోవడంతో పలువురు రైతులు వ్యవసాయ భూములను విక్రయించి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లి అస్థిరమైన జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. దళితులు, బహుజనులు, ఆదివాసీలు, మైనార్టీలు, సంచార వర్గాలు, మహిళలు జీవనోపాధి, హక్కుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వ్యవసాయ కూలీలను నైపుణ్యం కలిగిన కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వ భూమిని మహిళల పేరిట పంపిణీ చేయాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ కల్పించడంతో పాటు సామాజిక భద్రతను బలోపేతం చేయాలని సూచించారు.
మహాసభలో ప్రభుత్వానికి 16 డిమాండ్లను ప్రతిపాదించారు. ఆదివాసీలు, గ్రామీణ పేదలకు భూపంపిణీ చేయడంతో పాటు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పేసా, వన్ బై 70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన వేతనం చట్టబద్ధంగా కల్పించాలని డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు తదితర ప్రజా సంస్థల్లో పనిచేస్తున్న సేవా కార్మికులను వెంటనే ఉద్యోగులుగా గుర్తించి కనీసం రూ.27,600 వేతనం చెల్లించాలని కోరారు. వృద్ధాప్య పింఛన్‌కు అదనంగా ఉద్యోగ విరమణ పింఛన్‌గా రూ.6 వేల చొప్పున అందించాలని, ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర మహిళా కార్యదర్శి వెంకటేశ్వరమ్మ, బి. నాగన్న, తెలంగాణ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. చంద్రన్న, లక్ష్మీకాంతమ్మ, హజమ్మ, జోగిని వ్యతిరేక అధ్యక్షురాలు బిక్కం జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
