Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Xi-Trump-Us-Summit : అమెరికా రెడ్ కార్పెట్ Andhra Prabha Top News

Babu Bahadur September 24, 2026Donald Trump Xi Jinping Meeting, US China Summit 2026, US China Trade Truce, Xi Jinping US Visit, Xi Jinping Washington Visit

Xi-Trump-Us-Summit : అమెరికా రెడ్ కార్పెట్ Andhra Prabha Top News

  • జిన్ పింగ్ ఆగమనం
  • ట్రంప్ ఘన స్వాగతం
  • ప్రపంచ చూపు వీరిద్దరిపైనే !
  • వాషింగ్టన్‌లో మూడు రోజుల శిఖరాగ్ర సమావేశం
  • వాణిజ్య సంధి పొడిగింపుపై ఏకాభిప్రాయం
  • కృత్రిమ మేధ, కీలక ఖనిజాలు,
  • తైవాన్‌ అంశాలపై చర్చలకు సిద్ధం

(ఆంధ్రప్రభ, వాషింగ్గన్)

ప్రపంచంలోనే అగ్ర ఆర్థిక శక్తులైన అమెరికా, చైనా మధ్య మరో కీలక దౌత్య ఘట్టానికి తెరలేచింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ దశాబ్దానికి పైగా విరామం తర్వాత వాషింగ్టన్‌ డీసీలో అడుగుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో మూడు రోజుల పాటు జరిగే శిఖరాగ్ర భేటీ కోసం ఆయన తన భార్య పెంగ్‌ లియువాన్‌తో కలిసి జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌కు చేరుకున్నారు. ట్రంప్‌, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ స్వయంగా స్వాగతం పలికారు.

ఇరుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, సుంకాల వివాదాలు కొనసాగుతున్న వేళ ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రపంచ వాణిజ్యం, సాంకేతిక రంగం, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై ఈ భేటీ ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య సంధిని మరో రెండు నెలలు పొడిగించేందుకు అంగీకారం కుదిరినట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ వెల్లడించారు.

రెండోసారి ముఖాముఖి

ట్రంప్‌, జిన్‌పింగ్‌ ఈ ఏడాది మేలో చైనాలో చివరిసారిగా సమావేశమయ్యారు. అప్పట్లో బీజింగ్‌లోని గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ ది పీపుల్‌ వద్ద ట్రంప్‌కు జిన్‌పింగ్‌ ఘన స్వాగతం పలికారు. అమెరికా జాతీయ గీతం ఆలాపన, తుపాకుల గౌరవ వందనంతో ఆ కార్యక్రమం సాగింది. ఆ భేటీ నుంచి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. చైనా 200 బోయింగ్‌ విమానాల కొనుగోలుకు అంగీకరించడం, అమెరికా రైతులకు చైనా మార్కెట్‌లో మరింత ప్రవేశం కల్పిస్తామంటూ హామీలు ఇవ్వడం వంటి కొన్ని అంశాలే స్పష్టమైన ఫలితాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజా సమావేశంలో ఎలాంటి పురోగతి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

వాణిజ్య సంధి పొడిగింపు

అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య సంధిని మరో రెండు నెలలు పొడిగించేందుకు ఇరుదేశాల ఆర్థిక మంత్రులు అంగీకరించినట్లు స్కాట్‌ బెసెంట్‌ తెలిపారు. బుసాన్‌ ఒప్పందంగా పిలుస్తున్న ఈ అవగాహనను పొడిగించడంపై చైనా ఆర్థిక మంత్రి, తాను ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుత ఒప్పందాన్ని మరింత విస్తృతమైన వాణిజ్య ఒప్పందంగా మార్చగలమా? లేక ఉన్న ఒప్పందాన్నే మరోసారి పొడిగించాల్సి వస్తుందా? అన్నది ఇంకా స్పష్టతకు రాలేదని బెసెంట్‌ పేర్కొన్నారు. తాజా చర్చలు ఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక వాణిజ్య పరిష్కారానికి దారితీస్తాయా? అన్నది వేచి చూడాల్సిందే.

ఏఐపై చర్చలకు చైనా ఆసక్తి

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై చైనాతో కొత్త సమాచార మార్పిడి వ్యవస్థను ఏర్పాటు చేయగలమని ఆశిస్తున్నట్లు బెసెంట్‌ తెలిపారు. అమెరికాతో ఏఐ అంశంపై చర్చించేందుకు చైనా ఎంతో ఆసక్తిగా ఉందని ఆయన పేర్కొన్నారు. నియంత్రణ లేకుండా పనిచేసే ఏఐ ఏజెంట్లు, సైబర్‌ దాడులకు ఏఐని వినియోగించే ప్రభుత్వేతర శక్తులు, జీవాయుధాల అభివృద్ధికి ఈ సాంకేతికతను ఉపయోగించే ప్రమాదాలు.. తదితర అంశాలను ఇరుదేశాలు చర్చించే అవకాశముంది. అంతర్జాతీయ సరిహద్దులను దాటి ప్రభావం చూపిన ఏఐ సంబంధిత ఘటనలపై కూడా పరస్పరం చర్చించుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు బెసెంట్‌ వివరించారు.

కీలక ఖనిజాలు.. తైవాన్‌పైనా చర్చలు

వాణిజ్యం, సుంకాలతో పాటు సరఫరా వ్యవస్థలు, ఎగుమతుల నియంత్రణపై చర్చలు జరగనున్నాయి. కృత్రిమ మేధతో పాటు కీలక ఖనిజాల అంశం కూడా ఎజెండాలో ఉండనుంది. అరుదైన భూ ఖనిజాల తవ్వకం, శుద్ధి రంగాల్లో చైనాకు ఉన్న ఆధిపత్యం ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.

ఇక తైవాన్‌ అంశం, ప్రాంతీయ భద్రత, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్థిరత్వం వంటి కీలక అంశాలపైనా ఇరుదేశాధినేతలు చర్చించనున్నారు. శ్వేతసౌధంలో అధికారిక స్వాగత కార్యక్రమం, విందు సహా పలు దౌత్యపరమైన కార్యక్రమాల్లో జిన్‌పింగ్‌ పాల్గొననున్నారు.

అట్టహాసంగా స్వాగతం … గగనతలంలో బీ-1 బాంబర్లు

జిన్‌పింగ్‌ రాక సందర్భంగా అమెరికా ప్రభుత్వం ఘన స్వాగత ఏర్పాట్లు చేసింది. సుమారు 100 అడుగుల (30 మీటర్లు) పొడవైన ఎర్ర తివాచీపై ఆయనకు స్వాగతం పలికారు. ఫిరంగుల గౌరవ వందనం, అమెరికా-చైనా జాతీయ పతాకాలతో ప్రత్యేక సైనిక బృందాలు, అమెరికా వైమానిక దళ బ్యాండ్‌ రెండు దేశాల జాతీయ గీతాల ఆలాపనతో కార్యక్రమం సాగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, మెలానియా ట్రంప్‌ ప్రొటోకాల్‌కు భిన్నంగా స్వయంగా జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌కు చేరుకుని జిన్‌పింగ్‌ దంపతులకు స్వాగతం పలికారు. ఇరుదేశాధినేతలు, వారి సతీమణులు కరచాలనం చేసుకుని చిరునవ్వులతో పలకరించుకున్నారు. ఈ సందర్భంగా రెండు బీ-1 బాంబర్లు గగనతలంలో విన్యాసం చేశాయి. అమెరికా సంప్రదాయ, అణు దాడి సామర్థ్యంలో కీలకమైన ఈ సూపర్‌సోనిక్‌ యుద్ధ విమానాలు గతంలో ఇరాన్‌ ఆకాశంలోనూ యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్నాయి.

మీడియా కు దూరం

జిన్‌పింగ్‌ రాక కార్యక్రమానికి మూడు ప్రధాన అమెరికా కేబుల్‌ న్యూస్‌ నెట్‌వర్క్‌లు-సీఎన్‌ఎన్‌, ఫాక్స్‌ న్యూస్‌, ఎంఎస్‌ నౌ-ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడం గమనార్హం. ఆయా సంస్థల సిబ్బంది కార్యక్రమ ప్రాంగణంలో ఉన్నప్పటికీ, రాక దృశ్యాలను చిత్రీకరించలేదు. శ్వేతసౌధం ప్రాంగణంలో కొన్ని మీడియా సంస్థల జర్నలిస్టులపై విధించిన ఆంక్షలకు సంబంధించి న్యాయపోరాటం కొనసాగుతుండటమే ఇందుకు నేపథ్యంగా ఉన్నట్లు సమాచారం. అట్టహాసపు ఆహ్వానాలు, దౌత్య మర్యాదల మధ్య ప్రారంభమైన ట్రంప్‌-జిన్‌పింగ్‌ భేటీ.. ఆచరణాత్మకంగా ఏ మేరకు ఫలితాలనిస్తుందన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న ప్రశ్న. వాణిజ్య వివాదాలకు విరామం లభిస్తుందా? సాంకేతిక, భద్రతా రంగాల్లో విభేదాలు తగ్గుతాయా? అన్నది ఈ మూడు రోజుల చర్చలతో తేలనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News