Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

యాదాద్రిలో పార్టీ కార్యాలయాలపై పరస్పర దాడులు

Sowjanya Anneboina September 1, 2026prabhanews.com

  • ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్‌ ధ్వంసం..
  • బీజేపీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ధర్నా

యాదాద్రి, ఆంధ్రప్రభ ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై బీజేపీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసినట్లు కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. దీనికి నిరసనగా కాంగ్రెస్‌ నాయకులు భువనగిరిలోని బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకుల ఆందోళన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపై భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు.

సమస్యలు ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు, నిరసనల ద్వారా తెలియజేయాలే తప్ప భౌతిక దాడులకు పాల్పడటం ఏ రకమైన రాజకీయ సంస్కృతి అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించేది లేదని కాంగ్రెస్‌ నాయకులు హెచ్చరించారు.

బీజేపీ రాజకీయ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రీవాణి రవికుమార్‌ పేర్కొన్నారు. ఇరు వర్గాల పరస్పర ఆందోళనలు, నినాదాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాలు రాస్తారోకోలు నిర్వహించడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్పీ ఆకాంక్ష యాదవ్‌ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News