Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా..

Sowjanya Anneboina August 23, 2026prabhanews.com

ఆంక్షలున్నా కొనసాగుతున్న రవాణా..
ఆదివారం నాలుగు టిప్పర్ల ఇసుక దిగుమతి

శ్వారావుపేట, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు ఇసుక రవాణాపై ఆంక్షలు ఉన్నప్పటికీ అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు, ఉదయం 6 గంటల సమయంలో నాలుగు టిప్పర్ల గోదావరి ఇసుక అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రానికి చేరినట్లు స్థానికులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కుకునూరు మండలం దాచారం వద్ద డంప్ చేసిన గోదావరి ఇసుకను అశ్వారావుపేట మండలానికి అక్రమంగా తరలించినట్లు సమాచారం. గత వారం రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కుకునూరు మండలం నుంచి డంప్ చేసిన గోదావరి ఇసుకను అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి మండలాల్లోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఆదివారం తెల్లవారుజామున కూడా నాలుగు టిప్పర్లు మండలంలోకి ప్రవేశించడం అక్రమ రవాణా ఏ స్థాయిలో కొనసాగుతోందో తెలియజేస్తోందని అంటున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసు, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు తగిన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాచారం నుంచి అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి మండలాలకు ఇసుక తరలించే మార్గాల్లో పోలీసులు నిరంతరం నిఘా పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.

పలు పత్రికల్లో అక్రమ ఇసుక రవాణాపై కథనాలు ప్రచురితమైనప్పటికీ స్థానిక పోలీసు అధికారుల నుంచి జిల్లా స్థాయి ఉన్నతాధికారుల వరకు స్పందన కనిపించడం లేదని నియోజకవర్గ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నారు. గత రెండు నెలలుగా పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా నిషేధిత గోదావరి ఇసుకను అనుమతులు లేకుండా మండలంలోకి తరలించి డంప్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంతో అక్రమార్కులు భారీగా డబ్బు ఆర్జిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నందిపాడు వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసినట్లు గతంలో పోలీసులు వెల్లడించారు. అయితే ఇసుక రవాణా కొంతకాలం నిలిచిన అనంతరం అక్కడ పోలీసు సిబ్బందిని ఉంచడం నిలిపివేశారని స్థానికులు తెలిపారు. దీంతో చెక్‌పోస్ట్ ఉన్నప్పటికీ పర్యవేక్షణ లేకుండా పోయిందని అంటున్నారు. ఇసుక డంపింగ్ ప్రాంతాల నుంచి అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోకి ఇసుక తరలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించి రెండు, మూడు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తే అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పోలీసు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టి మండలంలోకి ప్రవేశించే ఆంధ్రప్రదేశ్ మార్గాల్లో నాలుగైదు చోట్ల పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News