Nagamani Malligari April 23, 2026MLA Dr. Vamsi Krishna
యువతకు ఉత్తమ క్రీడా వేదికగా ఎన్టీఆర్ స్టేడియం…
ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వంశీకృష్ణ సమీక్ష
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ ఈఈ, డీఈ, ఏఈ అధికారులతో కలిసి జరిగిన ఈ సమావేశంలో స్టేడియం అభివృద్ధికి సంబంధించిన ప్రస్తుత పనులపై సమగ్రంగా చర్చించారు.
అధికారులు పనుల పురోగతిని వివరించగా, మౌలిక వసతుల మెరుగుదల, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాల కల్పన, మైదానం స్థాయి పెంపు, ప్రేక్షకుల కోసం సౌకర్యాల విస్తరణ వంటి అంశాలపై ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. స్టేడియం అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి, యువతకు ఉత్తమ క్రీడా వేదికగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.
పనుల్లో ఎటువంటి ఆలస్యం లేకుండా నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

