Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

యువతి హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా దర్యాప్తు

Nagamani Malligari September 23, 2026prabhanews.com

శాస్త్రీయ ఆధారాలతో ముమ్మర దర్యాప్తు..
రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, ఆంధ్రప్రభ : యువతి హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేపడుతున్నామని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా తెలిపారు.

ఇటీవల గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసు అత్యంత ప్రాధాన్యత కలిగిన సున్నితమైనది కావడంతో సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్‌, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంద్రసేనారెడ్డితో కలిసి మృతురాలు అక్షిత రాణి నివాసాన్ని బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతి, నేరానికి సంబంధించిన వివరాలు, నేరం జరిగిన తీరు తదితర అంశాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, తుది న్యాయస్థాన తీర్పు వెలువడే వరకు దర్యాప్తు, న్యాయవిచారణ ప్రక్రియను సమర్థవంతంగా కొనసాగించాలని ఆదేశించారు. దర్యాప్తులో ఎలాంటి లోపాలు, అలసత్వం, నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

కేసులోని ప్రతి సాంకేతిక, న్యాయపరమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తును పూర్తి చేయాలని సీపీ ఆదేశించారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ నివేదికలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సక్రమంగా సేకరించి దర్యాప్తులో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. నిందితులకు న్యాయస్థానంలో కఠిన శిక్ష పడేలా పటిష్టమైన ఆధారాలతో కేసును ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. దర్యాప్తు, న్యాయవిచారణ ప్రక్రియలో సమన్వయంతో పనిచేయాలని ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌లను సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News