Indonesia Earthquake: తూర్పు ఇండోనేషియాలోని ఉత్తర మాలుకు ప్రావిన్స్‌లో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
సముద్ర గర్భంలో భూకంపం రావడంతో అధికారులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కొద్ది గంటల తర్వాత వాటిని ఉపసంహరించుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భూకంపం సంభవించిన వెంటనే పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం అప్రమత్తమైంది. భూకంప కేంద్రం నుండి 1,000 కిలోమీటర్ల పరిధిలోని ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఉత్తర మినాహాసా ప్రాంతంలో 75 సెంటీమీటర్ల ఎత్తులో చిన్నపాటి అలలు ఎగిసిపడ్డాయి. దాదాపు రెండు గంటల పరిశీలన తర్వాత, సముద్ర మట్టంలో పెద్దగా మార్పులు లేకపోవడంతో సునామీ ముప్పు తొలిగిపోయిందని అధికారులు ప్రకటించారు.
చరిత్ర సృష్టించిన NASA.. 50 ఏళ్ల తర్వాత చంద్రుడి చెంతకు మానవ యాత్ర
స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6:48 గంటలకు మొలుక్కా సముద్రంలో టెర్నాటే నగరానికి వాయువ్యంగా సుమారు 120 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. సముద్ర మట్టానికి 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపం సంభవించిన సమయంలో సుమారు ఒక నిమిషం పాటు భూమి బలంగా కంపించడంతో ఉత్తర సులవేసి, ఉత్తర మాలుకు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఒకరి మృతి.. ఆస్తి నష్టం
ఈ ప్రకృతి విపత్తులో కనీసం ఒకరు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. నార్త్ సులవేసి ప్రావిన్స్‌లోని మనాడో నగరంలో ఒక భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకొని ఒకరు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. మనాడో, టెర్నాటే ప్రాంతాల్లో పలు ఇళ్లు, పాఠశాలలు, చర్చిల గోడలు బీటలు వారినట్లు స్థానిక మీడియా ప్రతినిధులు తెలిపారు. భూకంపం దాటికి ఇళ్లలోని సామాన్లు కింద పడిపోవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
గూస్ బంప్స్ తెపిస్తున్న 'రామాయణ' టీజర్..
రింగ్ ఆఫ్ ఫైర్
ఇండోనేషియా భౌగోళికంగా పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' (Ring of Fire) ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు సంభవిస్తుంటాయి. టెక్టానిక్ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉండటం వల్ల ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకరమైన భూకంప జోన్‌గా పరిగణించబడుతుంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఇండోనేషియా వాతావరణ శాఖ (BMKG) సూచించింది.

