Dailyhunt
'ఆది' తర్వాత రఘుబాబు ట్రైన్ ఎక్కితే లేడీస్ భయపడి వెళ్లిపోయేవారు - అలీ

'ఆది' తర్వాత రఘుబాబు ట్రైన్ ఎక్కితే లేడీస్ భయపడి వెళ్లిపోయేవారు - అలీ

Telugu Samayam 3 weeks ago

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్‌తో, వైవిధ్యభరితమైన క్యారెక్టర్ రోల్స్‌తో మెప్పిస్తున్న నటుడు రఘుబాబు. ప్రముఖ సీనియర్ నటుడు గిరిబాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన స్వయంకృషితో గుర్తింపు తెచ్చుకున్న ఆయన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను కమెడియన్ అలీ తాజాగా బయటపెట్టారు.

* మలేషియాలో బాలయ్యని పోలిన వ్యక్తి.. పానీపూరీలు అమ్ముతూ!! వీడియో వైరల్

రఘుబాబు కెరీర్ తొలినాళ్లలో కరుడుగట్టిన విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టారు. ముఖ్యంగా దర్శకుడు వి.వి. వినాయక్ తెరకెక్కించిన 'ఆది' సినిమా ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. అంతకుముందు 'మురారి' సినిమాలో ఆయన నటనను చూసి ముగ్ధుడైన వినాయక్... రఘుబాబు గిరిబాబు అబ్బాయి అని తెలుసుకుని మరీ 'ఆది'లో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో ఆయన పండించిన క్రూరత్వం జనాదరణ పొందినా నిజ జీవితంలో ఆయనకు కొన్ని వింత అనుభవాలను మిగిల్చింది. ఆ తర్వాత 'బన్నీ' వంటి చిత్రాలు ఆయనకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టాయి. కాలక్రమేణా ఆయన విలన్ పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, అద్భుతమైన హాస్యనటుడిగా రూపాంతరం చెందారు.


తాజాగా 'రేసుగుర్రం' రీ-రిలీజ్ ఈవెంట్‌లో రఘుబాబు గురించి కమెడియన్ అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలీ మాట్లాడుతూ.. 'ఆది సినిమాలో రఘుబాబు చేసిన విలన్ పాత్ర ప్రభావం ఎంతలా ఉందంటే.. ఒకసారి ఆయన ట్రైన్‌లో ప్రయాణిస్తుంటే ఆయన్ని చూసి భయపడి మహిళా కంపార్ట్‌మెంట్‌లలో ఉన్నవారు తమ సీట్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు' అంటూ చెప్పుకొచ్చారు. రఘుబాబు నిజ జీవితంలో చాలా మృదుస్వభావి అయినప్పటికీ, ఆయన పోషించిన కఠోరమైన పాత్రలు సామాన్య జనాలను అంతలా ప్రభావితం చేశాయని అలీ కొనియాడారు.

* మొన్న హనీరోజ్.. నేడు మంజు వారియర్.. సెలబ్రెటీలపై హద్దులు దాటుతోన్న అభిమానం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన 'రేసుగుర్రం' సినిమాను ఏప్రిల్ 8, 2026న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ కామెడీ చిత్రం ఇప్పుడు 4K రీమాస్టర్డ్ వర్షన్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో 'కిల్ బిల్ పాండే'గా బ్రహ్మానందం పండించిన కామెడీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. రఘుబాబు కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించారు. బ్యాంక్ దొంగతనం సీన్‌లో ఆయన పండించిన హావభావాలు, హాస్యం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam