వైభవ్ సూర్యవంశీ.. 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌కు ఎంపికై.. 14 ఏళ్ల వయసులో డెబ్యూ చేసిన ఈ ప్లేయర్.. రికార్డులు బద్దలు కొడుతున్నాడు. 15 ఏళ్ల వయసులో తన రెండో ఐపీఎల్ సీజన్ ఆడుతున్న ఈ బుడ్డోడు..
బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. వేస్తున్న బౌలర్ ఎవరనేది చూడకుండా.. సిక్సర్ల సునామీ సృష్టిస్తున్నాడు. ఒక్క మ్యాచ్, రెండు మ్యాచులలో కొడితే గాలివాటం అనుకునేవారేమో.. కానీ అతడు మాత్రం కన్సిస్టెన్సీకి మారుపేరుగా మారిపోతున్నాడు. ఐపీఎల్ 2026లో రికార్డుల వర్షం కురిపిస్తున్న అతడు.. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఎలిమినేటర్‌లోనూ అదే జోరు కొనసాగించాడు.
ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. అయితే ఈ సీజన్‌లో లీగ్ స్టేజ్‌లో పరుగుల వరద పారించిన 15 ఏళ్ల యంగ్ డైనమేట్ వైభవ్.. తీవ్ర ఒత్తిడి ఉండే ఎలిమినేటర్‌లోనూ ఏమాత్రం తడబడలేదు. తొలి నుంచే ఎదురుదాడికి దిగాడు. ఏమాత్రం బెరుకు లేకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను చీల్చిచెండాడాడు.
సిక్సర్ల వర్షం కురిపించిన ఈ కుర్రాడు.. 16 బంతుల్లోనూ హాఫ్ సెంచరీ మార్కు చేరుకున్నాడు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఏకంగా హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ రాయల్స్ స్కోరు.. 80/0తో నిలిచింది. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన వైభవ్.. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టేలా కనిపించాడు. 28 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్.. భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా తీవ్ర నిరాశకు గురయ్యాడు.
ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఏకంగా 12 సిక్సర్లు బాదాడు. మరో ఐదు ఫోర్లు కూడా కొట్టాడు. తాను చేసిన మొత్తం 97 పరుగుల్లో సిక్సర్లు ఫోర్ల ద్వారానే.. సూర్యవంశీ 92 పరుగులు స్కోరు చేయడం గమనార్హం. దీంతో ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. ఫ్యూచర్ ఇండియా స్టార్ అనే పేరుకు అర్థం చెప్పేలా అతడు రాణిస్తున్నాడు.

