Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. ప్యానెల్‌లో చేరిన రమేష్ పవార్..!

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. ప్యానెల్‌లో చేరిన రమేష్ పవార్..!

Telugu Samayam 10 hrs ago

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. టీమిండియా క్రికెట్ జట్టుకు కొత్త చీఫ్ సెలక్టర్‌ను ఎంపిక చేసింది. జూలై 2023 నుంచి చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించిన అజిత్ అగార్కర్ తన పదవీ కాలాన్ని ముగించి తప్పుకోవడంతో, అతడి స్థానంలో మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను ఛైర్మన్‌గా నియమించింది.

బోర్డు నిబంధనల ప్రకారం ఎక్కువ టెస్టులు (24 టెస్టులు) ఆడిన సీనియారిటీ ఆధారంగా ఓజాకు ఈ బాధ్యతలు దక్కాయి. మరోవైపు, సీఏసీ నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా రమేష్ పవార్‌ను నూతన సెలెక్టర్‌గా కమిటీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం నూతన సెలెక్షన్ ప్యానెల్‌లో ప్రజ్ఞాన్ ఓజా (ఛైర్మన్), శివ్ సుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, రమేష్ పవార్ సభ్యులుగా ఉన్నారు.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ హయాంలో భారత జట్టు అద్భుత విజయాలను నమోదు చేసింది. ఈ కాలంలో టీమిండియా 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. రెండు ఆసియా కప్ టైటిళ్లను, అలాగే ఆసియా క్రీడల్లో వరుసగా స్వర్ణ పతకాలను సాధించి మైలురాయిని అందుకుంది. అగార్కర్ అందించిన విశేష సేవలను, ఆయన కమిటీ చేసిన అద్భుతమైన కృషిని బీసీసీఐ ప్రత్యేకంగా కొనియాడింది. పదవీకాలాన్ని పొడిగించుకోవడానికి అగార్కర్ ఆసక్తి చూపకపోవడంతో ఈ మార్పు అనివార్యమైంది.


ప్రజ్ఞాన్ ఓజా సెప్టెంబర్ 2025లో జరిగిన 94వ బీసీసీఐ వార్షిక సాధారణ సభ సమయంలోనే ఆర్పీ సింగ్‌తో కలిసి సెలెక్షన్ కమిటీలోకి అడుగుపెట్టాడు. కేవలం ఏడాది కాలంలోనే అతడు ప్యానెల్ ఛైర్మన్ స్థాయికి ఎదగడం విశేషం. ఓజా భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20ఐ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. కమిటీలోని మిగతా సభ్యుల కంటే ఎక్కువ టెస్టుల అనుభవం ఉండటంతో ఓజాకు ఈ కీలక పదవి దక్కింది. రాబోయే కాలంలో టీమిండియా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా జట్టును తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఓజా నేతృత్వంలోని ప్యానెల్‌పై ఉంది.

ఇక నూతన సభ్యుడిగా చేరిన రమేష్ పవార్‌కూ అంతర్జాతీయ ఆటగాడిగా, కోచ్‌గా మంచి అనుభవం ఉంది. భారత్ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడిన పవార్, భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌గా, ముంబై, గుజరాత్ జట్ల కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. పవార్ కోచింగ్‌లో భారత మహిళల జట్టు ఆసియా కప్ విజేతగా నిలవడమే కాకుండా కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించింది. అనుభవజ్ఞులైన ఓజా, పవార్‌ల రాకతో భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ మరింత పటిష్టంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam