Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బొల్లారం ఆర్మీ క్యాంపు సమీపంలో భారీగా డిటోనేటర్లు.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్

బొల్లారం ఆర్మీ క్యాంపు సమీపంలో భారీగా డిటోనేటర్లు.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్

Telugu Samayam 2 weeks ago

హైదరాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ ఘటనపైదర్యాప్తు కొనసాగుతుండగానే అదే ప్రాంతంలో డిటోనేటర్లు లభించడం కలకలం రేపింది. ఫైరింగ్‌ రేంజ్‌ వెనుక గోడ సమీపంలో ప్లాస్టిక్‌ బకెట్‌లో 8 బండిల్స్‌గా ఉన్న మొత్తం 160 ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లను ఆర్మీ సిబ్బంది గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. మల్కాజిగిరి బాంబ్‌ డిస్పోజల్‌ టీమ్‌ సూచనల మేరకు డిటోనేటర్లను భద్రపరిచినట్లు సమాచారం. వాటిని అక్కడ ఎవరు వదిలివెళ్లారు ? ఏదైనా పనిలో భాగంగా అక్కడికి తీసుకొచ్చారా ? లేక ఇతర ప్రాంతం నుంచి తరలించి అక్కడ పడేశారా ? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. లభ్యమైన డిటోనేటర్ల విలువ సుమారు రూ.32 వేల వరకు ఉంటుందని అంచనా. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న ఆర్మీ పరిధిలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకోవటం చర్చకు దారితీయగా.. అధికారులు అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే డిటోనేటర్లు బయటపడటంతో పోలీసులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. రెండు ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా ? లేదా అవి వేర్వేరు ఘటనలా ? అనే అంశంపైనా దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా.. రెండ్రోజుల క్రితం మద్రాస్‌ రెజిమెంట్‌లోని ఆయుధాలు భద్రపరిచే గది తాళాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అపహరించినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన కేసు కావడంతో దర్యాప్తు వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలో రక్షణ దళాలకు చెందిన శిక్షణ సంస్థలు, వివిధ రెజిమెంట్లు కొనసాగుతున్నాయి. వాటిలో మద్రాస్‌ రెజిమెంట్‌ కూడా ఒకటి. ఇక్కడ ఆర్మీ సిబ్బంది ఉపయోగించే ఆయుధాలను భద్రపరిచే ప్రత్యేక విభాగం ఉంది. అనుమతి ఉన్న సిబ్బంది మినహా ఇతరులకు ప్రవేశం ఉండని ఈ ప్రాంతంలో ఆయుధాల గది తాళం పగులగొట్టడం భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తింది.

ఆయుధాల చోరీలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్‌సాస్‌ రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రి అపహరణకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఆయుధాల ఆచూకీ కోసం పోలీసులు, రక్షణ అధికారులు సమన్వయంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా డిటోనేటర్లు లభ్యం కావడంతో చోరీ కేసులో దర్యాప్తు మరింత కీలకంగా మారింది. డిటోనేటర్ల మూలం, వాటిని అక్కడకు తీసుకొచ్చిన వ్యక్తులు, ఆయుధాల చోరీతో వాటికి ఏదైనా సంబంధం ఉందా అనే అంశాలపై విచారణ తర్వాత దర్యాప్తు సంస్థలు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam