ఆపరేషన్ సింధూర్ ద్వారా బ్రహ్మోస్ క్షిపణుల పవర్ ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. దీంతో భారత్, రష్యా సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్ మిస్సైళ్లను కొనుగోలు చేయడానికి పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
చైనాతో చిక్కులు ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్ ఇప్పటికే భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసింది. తాజాగా ఇండోనేసియా సైతం భారత బ్రహ్మా్స్త్రంగా పేరొందిన బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుంది. చైనా జలాంతర్గామి నుంచి ఫసిపిక్ సముద్ర జలాల్లోకి క్షిపణిని ప్రయోగించిన రెండు రోజుల వ్యవధిలోనే భారత్, ఇండోనేసియా మధ్య ఒప్పందం కుదరడం గమనార్హం.
ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబొవో సుబియాంతో మధ్య మంగళవారం ఒప్పందం కుదిరింది. బ్రహ్మోస్, అస్త్ర మిస్సైళ్ల సరఫరాతోపాటు అరుదైన ఖనిజాల విషయంలో సహకారంపైనా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. అస్త్ర మిస్సైళ్లను భారత్ స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసింది.
ఫిలిప్ఫిన్స్‌లాగే ఇండోనేసియా సైతం చైనా నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇండోనేసియా పరిధిలోని నతునా దీవుల పరిధిలోకి చైనా నౌకలు చొరబడుతున్నాయి. దీంతో బ్రహ్మోస్ లాంటి అత్యాధునిక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు తన దగ్గర ఉంటే చైనా ఆ సాహసం చేయదని ఇండోనేసియా భావిస్తోంది. అందుకే భారత్ దగ్గర్నుంచి వాటిని పొందేందుకు ఒప్పందం చేసుకుంది. మరో వైపు వియత్నాం కూడా బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారత్‌తో చర్చలు జరుపుతోంది.
దాదాపు వారం రోజుల, మూడు దేశాల పర్యటనను ఇండోనేసియా టూర్‌తో ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు వెళ్లనున్నారు. ఆర్థిక, భద్రతాపరమైన సహకారం కోసం.. రక్షణ ఒప్పందాలను బలోపేతం చేయడం, టెక్నాలజీలో సహకారం, రేర్ ఎర్త్ మినరల్స్ తదితరాల కోసం ప్రధాని మోదీ ఈ పర్యటన చేపడుతున్నారు.
జకార్తాలో ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబొవో, ప్రధాని మోదీ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. హిందూ మహాసముద్రంలో నౌకల భద్రత, రక్షణ కోసం ఇరు దేశాలకు చెందిన కోస్ట్ గార్డ్ దళాలు కలిసి పని చేస్తాయన్నారు.
బ్రహ్మోస్ మిస్సైళ్ల కోసం ఇండోనేసియా రక్షణ శాఖ.. భారత్, రష్యా జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్‌తో ఒప్పందం చేసుకోగా.. అస్త్ర మిస్సైళ్ల కోసం భారత్ డైనమిక్ లిమిటెడ్‌తో ఇండోనేసియాకు చెందిన ప్రయివేట్ డిఫెన్స్ కంపెనీ రిపబ్లిక్‌కార్ప్ ఒప్పందంపై సంతకాలు చేసింది.

