Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డబ్ల్యూపీఎల్ 2027 వేలానికి సర్వం సిద్ధం.. పోటీలో 146 మంది క్రికెటర్లు!

డబ్ల్యూపీఎల్ 2027 వేలానికి సర్వం సిద్ధం.. పోటీలో 146 మంది క్రికెటర్లు!

Telugu Samayam 4 hrs ago

మహిళల క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2027 సీజన్‌కు సంబంధించి వేలం ప్రక్రియ వేగవంతమైంది. ఈసారి ప్లేయర్ ఆక్షన్‌ను అక్టోబర్ 28న కేరళలోని కొచ్చి నగరంలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఈ వేలంలో మొత్తం 27 ఖాళీల కోసం 146 మంది ఆటగాళ్లు పోటీ పడనున్నారు. ఇందులో 20 స్లాట్లు భారతీయ ఆటగాళ్ల కోసం ఉండగా, మరో 7 స్లాట్లు విదేశీ ఆటగాళ్ల కోసం కేటాయించారు. ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ వేలం అత్యంత కీలకంగా మారనుంది.

ఈ ఆక్షన్ కోసం విడుదల చేసిన జాబితాలో ఇంగ్లండ్ బ్యాటర్ సోఫియా డంగ్లీ, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్ రూ. 50 లక్షల అత్యధిక బేస్ ప్రైస్ (గరిష్ట ధర) స్లాబ్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరి తర్వాత జి.కమలిని, కిరణ్ నవ్‌గిరే, హీథర్ గ్రాహం, జెస్ జోనాసెన్ రూ. 40 లక్షల బేస్ ప్రైస్ జాబితాలో నిలిచారు. అలాగే చమరి ఆటపట్టు, గ్రేస్ హారిస్, క్లో ట్రయాన్, స్నేహ రాణా వంటి స్టార్ ప్లేయర్లు రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌లో ఉన్నారు. మొత్తం 119 మంది భారతీయ ఆటగాళ్లు (22 క్యాప్డ్, 97 అన్‌క్యాప్డ్) ఈ వేలంలోకి రానున్నారు.

వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ఇప్పటికే ఖరారు చేశాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గ్రేస్ హారిస్‌తో సహా నలుగురు ఆటగాళ్లను రిలీజ్ చేయగా, గుజరాత్ జెయింట్స్ అత్యధికంగా 15 మందిని అట్టిపెట్టుకుని డానీ వ్యాట్-హాడ్జ్‌ను వదులుకుంది. ముంబై ఇండియన్స్ 11 మందిని, ఢిల్లీ క్యాపిటల్స్ 13 మందిని రిటైన్ చేసుకున్నాయి. ఇక యూపీ వారియర్జ్ ఫ్రాంచైజీ అత్యధికంగా 9 మంది ఆటగాళ్లను (డియాండ్రా డాటిన్, ట్రయాన్, నవ్‌గిరే తదితరులను) విడిచిపెట్టింది. అంతేకాకుండా తారా నారిస్‌ను ముంబైకి ట్రేడ్ చేసుకుంది.

దీంతో యూపీ వారియర్జ్ జట్టు వద్ద ప్రస్తుతం అత్యధికంగా రూ. 3.75 కోట్ల పర్స్ బ్యాలెన్స్, భర్తీ చేయాల్సిన 8 స్లాట్లు మిగిలి ఉన్నాయి. ఈసారి వేలంలో అత్యధిక మొత్తం వెచ్చించే అవకాశం ఈ ఫ్రాంచైజీకే ఉంది. అసోసియేట్ నేషన్స్ నుంచి ఆరుగురు ఆటగాళ్లతో కలిపి మొత్తం 27 మంది విదేశీ ప్లేయర్లు ఈ వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కొచ్చి వేదికగా జరిగే ఈ మహా వేలంలో ఏ ఫ్రాంచైజీ ఏ ప్లేయర్‌ను దక్కించుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam