తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించాలని ఎంతోమంది హీరోలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ సరిగ్గా 25 ఏళ్ల క్రితమే మెగాస్టార్ చిరంజీవి ఒక భారీ హాలీవుడ్ ప్రాజెక్ట్‌తో అంతర్జాతీయ యవనికపై సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
అదే 'ద రిటర్న్ ఆఫ్ ద థీఫ్ ఆఫ్ బాగ్దాద్' (The Return of the Thief of Baghdad). తెలుగులో 'అబూ: బాగ్దాద్ గజదొంగ' అనే పేరుతో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు.
* బండోడు ప్లేస్‌లో బక్కోడు... బాలయ్య-కొరటాల మూవీ బిగ్ అప్‌డేట్!
భారీ బడ్జెట్.. అంతర్జాతీయ తారాగణం
1999వ సంవత్సరంలో టాలీవుడ్ ఊహకందని విధంగా దాదాపు 20 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. హాలీవుడ్ వెర్షన్ కోసం డచెన్ జెర్సీ, తెలుగు వెర్షన్ కోసం సురేష్ కృష్ణ దర్శకులుగా ఎంపికయ్యారు. హాలీవుడ్ వెర్షన్ 90 నిమిషాలు, తెలుగు వెర్షన్ రెండున్నర గంటల నిడివితో సమాంతరంగా షూటింగ్ జరపాలని నిర్ణయించారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించడం మరో విశేషం. ప్రముఖ హాలీవుడ్ నటుడు ఒమర్ షరీఫ్ కీలక పాత్రలో నటించాల్సి ఉండగా, అమెరికన్ మోడల్ సాషా హీరోయిన్‌గా ఎంపికయ్యారు.
* 'విశ్వంభర'కి లైన్ క్లియర్ చేసిన 'పెద్ది'... జులైలో సోలోగా వస్తోన్న మెగాస్టార్!
1999 అక్టోబర్ 4న రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆ తర్వాత అక్టోబర్ 11 నుంచి రాజస్థాన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అయితే, వ్యాపార వర్గాల కోసం సిద్ధం చేసిన ఒక చిన్న ట్రైలర్ ఈ సినిమా తలరాతను మార్చేసింది. ఆ ట్రైలర్‌లో ఒక సన్నివేశంలో పవిత్ర ఖురాన్ గ్రంథానికి సంబంధించిన పేజీలను అగౌరవపరిచినట్లు కనిపించడంతో వివాదం రాజుకుంది. ముస్లిం మత పెద్దల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో నిరసనలు మిన్నంటడంతో పోలీసులు జోక్యం చేసుకుని షూటింగ్‌ను నిలిపివేశారు.
అసంపూర్తిగా మిగిలిన మెగా కల
వివాదం సద్దుమణిగిన తర్వాత మళ్ళీ షూటింగ్ ప్రారంభించాలని చూసినా అప్పటికే బడ్జెట్ అంచనాలు పెరిగిపోయాయి. భారీ సెట్లు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల ఖర్చులు నిర్మాతలకు భారంగా మారాయి. చిరంజీవి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆశతో వేచి చూసినప్పటికీ, అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. అప్పట్లో విడుదలైన చిరంజీవి స్టిల్స్ చూస్తే ఒక హాలీవుడ్ హీరో రేంజ్‌లో ఆయన లుక్ ఉండేది. అలా ఒక గొప్ప ప్రయోగం మధ్యలోనే ఆగిపోయింది. ఒకవేళ ఈ సినిమా పూర్తయి ఉంటే పాతికేళ్ల ఏళ్ల క్రితమే తెలుగు సినిమా సత్తా ప్రపంచవ్యాప్తంగా తెలిసి ఉండేది. ఇప్పటికీ మెగా అభిమానులకు 'అబూ' ఒక తీరని కోరికగానే మిగిలిపోయింది.

