Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెుక్కజొన్నకు ఆల్‌టైమ్‌ రికార్డు ధర.. మార్క్‌ఫెడ్ చరిత్రలోనే తొలిసారిగా, క్వింటా ఎంతంటే..?

మెుక్కజొన్నకు ఆల్‌టైమ్‌ రికార్డు ధర.. మార్క్‌ఫెడ్ చరిత్రలోనే తొలిసారిగా, క్వింటా ఎంతంటే..?

Telugu Samayam 2 weeks ago

తెలంగాణలో రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్నల విక్రయంలో మార్క్‌ఫెడ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. సంస్థ చరిత్రలోనే మొదటిసారిగా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే అత్యధిక ధర లభించి రికార్డు స్థాయి లాభాలు నమోదయ్యాయి.

ఈ-వేలం విధానం ద్వారా నిర్వహించిన పారదర్శక టెండర్ల వల్ల వ్యాపారుల సిండికేట్‌కు చెక్ పడటమే కాకుండా.. మార్క్‌ఫెడ్‌కు భారీగా ఆదాయం సమకూరింది.

గతంలో ప్రతి ఏటా టెండర్ల సమయంలోవ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి మద్దతు ధర కంటే చాలా తక్కువ ధరకు కొటేషన్లు వేసేవారు. అధికారుల సహకారంతో తక్కువ ధరలకే విక్రయాలు జరగడం వల్ల మార్క్‌ఫెడ్ తీవ్ర నష్టాలను చవిచూసింది. ఇప్పటికే ఈ సంస్థ రూ. 1000 కోట్ల నష్టాల్లో ఉండటంతో పాటు, మరో రూ. 2 వేల కోట్ల అప్పుల భారంతో కూరుకుపోయింది. ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్క్‌ఫెడ్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి టెండర్ల ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.

మంత్రి ఆదేశాల మేరకు సిండికేట్లకు ఎలాంటి అవకాశం లేకుండా కేవలం ఈ-వేలం ద్వారానే టెండర్లు నిర్వహించాలని నిర్ణయించారు. క్వింటాలుకు మద్దతు ధర రూ.2,400 చొప్పున, టన్నుకు కనీసం రూ.24 వేల కంటే తక్కువ ధర వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించకూడదని కఠిన నిబంధన పెట్టారు. దీనికి అనుగుణంగా మార్క్‌ఫెడ్ యాసంగి సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన 14.60 లక్షల టన్నుల మొక్కజొన్నలో 10.98 లక్షల టన్నులకు గాను జులై 31, ఆగస్టు 1, ఆగస్టు 3 తేదీల్లో మూడు విడతలుగా విజయవంతంగా ఈ-వేలం నిర్వహించింది. అనంతరం సోమవారం అధికారులు ఆ టెండర్లను సమగ్రంగా పరిశీలించి ఖరారు చేశారు.

ఈ మూడు విడతల వేలంలో మొక్కజొన్నకు ఊహించని విధంగా విశేష స్పందన లభించింది. టన్నుకు గరిష్ఠ ధర రూ. 26,500 పలకగా, ఇది వేలం కనీస ధర కంటే రూ. 2,500 ఎక్కువ కావడం విశేషం. కనిష్ఠ ధర కూడా మద్దతు ధర కంటే ఎక్కువగా రూ.24,100 గా నమోదైంది. మొత్తంగా ఈ విక్రయాల్లో సగటున టన్నుకు రూ. 25,370 ధర లభించింది. దీంతో మార్క్‌ఫెడ్‌కు కొనుగోలు వెచ్చించిన సొమ్ముతో పోలిస్తే టన్నుకు సుమారు రూ. 1,370 లాభం సమకూరింది. సరైన నిర్ణయాలు, పారదర్శక విధానాల వల్ల సంస్థకు ఈ స్థాయిలో లాభాలు రావడం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam