శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టుల సిరీస్ ఆడనున్న భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మొదట భారత జట్టు స్థానిక శ్రీలంక XI జట్టుతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా, దానిని మూడు రోజులకు కుదించారు.
ఈ వార్మప్ మ్యాచ్ కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ స్టేడియం సమీపంలో ఉన్న ఎన్‌సీసీ మైదానంలో ఈ మ్యాచ్ ఆగస్టు 7 నుంచి ప్రారంభమై ఆగస్టు 9తో ముగుస్తుంది. ఈ మార్పుకు సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఇప్పటికే బీసీసీఐ, భారత జట్టు యాజమాన్యానికి స్పష్టమైన సమాచారం ఇచ్చింది. అయితే కారణం మాత్రం తెలియలేదు.
వార్మప్ మ్యాచ్ తర్వాత భారత్, శ్రీలంక జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే భారత్ ఈ సిరీస్‌లో గెలవడం అత్యవసరం. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. గాయంతో ఇబ్బంది పడ్డ బుమ్రా.. పూర్తి ఫిట్ నెస్ సాధించినట్లు తెలుస్తోంది. మరోవైపు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌పై సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. బొటనవేలి గాయంతో బాధపడుతున్న సుదర్శన్, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటూ ఇప్పటికే బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. జట్టు శ్రీలంక బయలుదేరే సమయానికి అతడు పూర్తి స్థాయిలో సిద్ధమవుతాడని భావిస్తున్నారు.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా ఆగస్టు 4నే కొలంబో బయలుదేరనుంది. మూడు రోజుల వార్మప్ మ్యాచ్ పూర్తయిన అనంతరం, మొదటి టెస్ట్ జరిగే చారిత్రాత్మక వేదిక గాల్‌కు జట్టు చేరుకుంటుంది. ఆగస్టు 15 నుంచి తొలి టెస్టు, ఆగస్టు 23 నుంచి రెండో టెస్టు జరుగుతుంది.
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నార్ బ్రార్, దేవ్‌దత్ పడిక్కల్, సారాన్ష్ జైన్.

