ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ హవా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో రెండోసారి అతడు 15 బంతుల్లో హాఫ్ సెంచరీ స్కోరు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచులు ఈ చిచ్చరపిడుగు విధ్వంసం సృష్టించాడు. 26 బంతుల్లో ఏకంగా 78 పరుగులు చేశాడు. హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలింగ్‌లోనూ ఊచకోత కోశాడు. దీంతో ఈ టోర్నీలో ఆర్ఆర్ వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని అందించాడు. వైభవ్ సూర్యవంశీ (26 బంతుల్లో 78 రన్స్), ధ్రువ్ జురెల్ (43 బంతుల్లో 81 రన్స్) రాణించడంతో పవర్ ప్లే ముగిసే సరికి 97/1తో నిలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. వైభవ్ సూర్యవంశీ పవర్ ప్లే ముగిసే సరికే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి.. ఆర్సీబీ నుంచి మ్యాచ్ లాగేశాడు.
వైభవ్ ఔట్ అయిన కాసేపటికే హిట్‌మెయర్ (0), రియాన్ పరాగ్ (3) పెవిలియన్ చేరినా.. రవీంద్ర జడేజా సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. జురెల్‌తో కలిసి ఆబేధ్యమైన ఐదో వికెట్‌కు 50 బంతుల్లో 68 రన్స్ జోడించాడు. 25 బంతుల్లో 24 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచులో ఆర్ఆర్ 4 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో మ్యాచ్ ముగించింది. టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. ఓ దశలో 2.5 ఓవర్లలో 45/1తో భారీ స్కోరుపై కన్నేసింది. ఆ తర్వాత 94/6, 125/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ చివర్లో కెప్టెన్ రజత్ పటీదార్ (40 బంతుల్లో 63 రన్స్), ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ (15 బంతుల్లో 29 రన్స్) సత్తాచాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 రన్స్ స్కోరు చేసింది.

