అక్కినేని నట వారసత్వంతో వెండితెరకు పరిచయమైనప్పటికీ, మొదటి నుంచీ కమర్షియల్ హంగుల కంటే కథా బలమున్న పాత్రలకే ప్రాధాన్యమిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు ప్రముఖ నటుడు సుమంత్.
దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా సినీ రంగప్రవేశం చేసిన ఆయన, లవర్ బాయ్‌గా మాత్రమే కాకుండా ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. వైవిధ్యమైన కంటెంట్‌ను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుమంత్... రాజేష్ కర్ణ దర్శకత్వంలో నటించిన 'న్యూటన్స్ థర్డ్ లా' అనే సస్పెన్స్ థ్రిల్లర్ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఒక స్పెషల్ మీట్‌లో సుమంత్ తన మనసులోని ఒక ఆసక్తికరమైన కోరికను వెల్లడించారు. ఇన్నాళ్లూ కథానాయకుడిగా మెప్పించిన ఆయన, భవిష్యత్తులో గనక పూర్తిస్థాయి విలన్ పాత్ర చేయాల్సి వస్తే ఎవరి సినిమాలో నటించాలని ఉందో స్పష్టం చేశారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన పవర్‌ఫుల్ విలన్‌గా నటించాలనేది తన కోరిక అని సుమంత్ తెలిపారు. మహేష్ బాబుకు ఆపోజిట్‌గా ప్రతి నాయకుడి పాత్ర చేస్తే ఆ ప్రాజెక్ట్ ఇచ్చే ప్రాధాన్యత, ఎనర్జీ వేరే స్థాయిలో ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
* 18 ఏళ్లకే సినీ ఆఫర్.. అమ్మానాన్నల ధైర్యమే నన్ను ఇక్కడిదాకా తెచ్చింది: ప్రీతి ముకుందన్
అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన సుమంత్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అలాంటి నటుడు మహేష్‌బాబుకి విలన్‌గా నటించాలని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. దీంతో ఘట్టమనేని, అక్కినేని అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగిన విలన్‌గా సుమంత్ నటిస్తే కాంబినేషన్ అదిరిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి సుమంత్ కల ఎప్పటికైనా నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.
సుమంత్ సినీ ప్రయాణం 1999లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ప్రేమ కథ' చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత 2003లో సూర్యకిరణ్ దర్శకత్వంలో వచ్చిన 'సత్యం' సినిమా ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక 2006లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'గోదావరి' చిత్రం సుమంత్ కెరీర్‌లో ఒక మైలురాయిలా మిగిలిపోయింది. ఇందులో ఆయన పోషించిన రామ్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో అలరించి, ఆ చిత్రాన్ని ఒక క్లాసిక్ హిట్‌గా నిలబెట్టింది. కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా విభిన్న కథాంశాలను ఎంచుకోవడంలో సుమంత్ ఎప్పుడూ ముందుంటారు. 2011లో వచ్చిన 'గోల్కొండ హైస్కూల్' సినిమాలో క్రికెట్ కోచ్‌గా ఆయన చూపించిన అభినయం ప్రశంసలు అందుకోగా, 2017లో వచ్చిన 'మళ్ళీ రావా' చిత్రం ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా విజయాన్ని సాధించింది. ఇక 'సీతారామం' (2022) చిత్రంలో ప్రతినాయక చాయలున్న పాత్రను సైతం అంగీకరించి తనలోని సరికొత్త కోణాన్నిఆవిష్కరించారు.

