Amilineni Surendra Babu Press Meet: రాష్ట్ర దృష్టిని ఆకర్షించేలా పసుపు సైనికుల పండుగగా మహానాడు
-విభేదాలకు తెరదించి తెలుగుదేశం శక్తిని చాటుదాం
-ప్రతి ఇంటిపై టిడిపి జెండా ఎగురాలి - ప్రతి గ్రామంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు
–పసుపు చీరలతో తెలుగు మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలి
–ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపు
తెలుగుదేశం పార్టీకి కళ్యాణదుర్గం నియోజకవర్గం కంచుకోట అనే గుర్తింపును మరింత ఘనంగా నిలబెట్టేలా ఈసారి నిర్వహించనున్న వర్చువల్ మహానాడు వేడుకలను పసుపు సైనికుల మహోత్సవంగా మార్చాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని కళ్యాణదుర్గం వైపు తిప్పేలా మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం కళ్యాణదుర్గం ప్రజావేదికలో నిర్వహించిన మహానాడు ఏర్పాట్ల సమీక్ష సమావేశం రాజకీయ ఉత్సాహానికి ప్రతీకగా నిలిచింది. కార్యక్రమానికి మహానాడు పరిశీలకులు, వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ రామకృష్ణ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
Read Also :Bhimavaram: గేయ రచయిత అనంత్ శ్రీరామ్ కలెక్టరేట్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
Amilineni Surendra Babu Press Meet: ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ… దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు 11 క్లస్టర్ల పరిధిలో వర్చువల్ మహానాడు కార్యక్రమాలను సాంకేతిక సౌకర్యాలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం, ప్రతి ఇంటిపై టిడిపి జెండా ఎగరవేయడం, ఇంటింటా తోరణాలు కట్టి పండుగ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా మహానాడును ప్రజల పండుగగా మార్చాలని పిలుపునిచ్చారు. "పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలే తెలుగుదేశం బలమైన అస్త్రం" అని పేర్కొన్న ఆయన, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కష్టపడే నాయకులను గుర్తించి క్లస్టర్ ఇంచార్జులకు సముచిత గౌరవం కల్పిస్తున్నారని చెప్పారు.

గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం స్థానిక సంస్థలకు భవిష్యత్తులో భారీ నిధులు సమకూర్చే దిశగా కృషి చేస్తోందన్నారు. ఈనెల 27, 28 తేదీలలో జరగనున్న మహానాడు కార్యక్రమాలకు మహిళలు పసుపు చీరలు, కార్యకర్తలు పసుపు దుస్తులు ధరించి భారీగా హాజరై పార్టీ ఐక్యతను, క్రమశిక్షణను చాటాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ మహానాడు వేదికల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్‌తో పాటు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష మహానాడు అనుభూతిని కలిగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మండల కన్వీనర్లు గోళ్ళ వెంకటేశులు, ధనుంజయ, పాల వెంకటాపురం శ్రీరాములు, శివన్న, టీఆర్ తిప్పేస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ బోయ లక్ష్మీదేవి తదితరులు మాట్లాడుతూ మహానాడు విజయవంతం కోసం ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జున, కంబదూరు రామ్మోహన్ చౌదరి, శ్రీరాములు, క్లస్టర్ ఇంచార్జులు, గ్రామాలు-మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన టిడిపి శ్రేణులు పాల్గొని మహానాడు విజయంపై ధీమా వ్యక్తం చేశారు
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

