Mumbai : ముంబై నగరంలో మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున ప్రాణనష్టం కలిగించేందుకు జరిగిన ఒక ఘోరమైన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
ఈ ఊరేగింపులో విషపు క్యాప్సూల్స్ (మాత్రలు) పంపిణీ చేసి మారణహోమం సృష్టించాలని ప్రయత్నించిన ఫయాజ్ అనే వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి నుంచి పోలీసులు ప్రాణాంతకమైన 14,900 విషపు పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా అతడు ఇప్పటికే మరో 30,000 క్యాప్సూల్స్‌తో పాటు, భారీ ఎత్తున కెమికల్స్ తయారీకి వాడే 50 కిలోల ఎలుకల మందును కూడా ఆర్డర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏకంగా 15,000 మందిని పొట్టనబెట్టుకోవడమే తన టార్గెట్ అని, ఈ ఘాతుకాన్ని తాను ఏదో ఒక గొప్ప కార్యంగా భావించి చేస్తున్నానని నిందితుడు విచారణలో వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోంది.

అంతర్జాతీయ లింకులపై పోలీసుల ఆరా
నిందితుడైన ఫయాజ్ సాధారణ అక్షరాస్యుడు కాదని, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో BBA (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) చదివిన ఉన్నత విద్యావంతుడు కావడం గమనార్హం. ఉన్నత చదువులు చదివిన వ్యక్తి ఇలాంటి తీవ్రవాద ఆలోచనల వైపు మళ్లడం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇతడు ఇరాన్, ఇరాక్ వంటి దేశాలలో పర్యటించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో, అతడికి విదేశాల్లో ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా, ఈ భారీ మొత్తంలో విషపు మాత్రలు సేకరించడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, మరియు ఈ ఘోర కుట్ర వెనుక అసలు మాస్టర్‌మైండ్స్ ఎవరున్నారనే కోణంలో ముంబై పోలీసులు మరియు దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ జరుపుతున్నాయి.

